స్వతంత్ర వెబ్ డెస్క్: చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఉభయ సభలు ఆమోద ముద్ర వేశాయి. దీంతో మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు.. తాజాగా రాజ్యసభలో కూడా నెగ్గింది. దీంతో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారడానికి కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇక చివరిగా రాష్ట్రపతి ఆమోదం కూడా లభిస్తే.. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లు చట్టంగా మారనుంది. దీంతో చట్టసభల్లో నారీ భేరి వినిపించనుంది.
లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెంచేలా.. వారికి 33 శాతం సీట్లు కేటాయించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు ఉభయసభలు ఆమోద ముద్ర వేశాయి. ఇప్పటికే ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందగా.. గురువారం రాజ్యసభలో కూడా ఆమోదం లభించింది. ఓటింగ్ సమయంలో పెద్దల సభలో ఉన్న సభ్యులందరూ ఏకగ్రీవంగా బిల్లుకు మద్దతు తెలపడంతో సులువుగా ఆమోదం పొందింది. సుదీర్ఘ చర్చ తర్వాత ఈ ఓటింగ్ నిర్వహించారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ చరిత్రాత్మక బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టగా.. సుదీర్ఘంగా చర్చ జరిపారు. చివరికి ఓటింగ్ నిర్వహించగా.. సభలోని సభ్యులు అందరూ మద్దతుగా ఓటు వేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో నిర్వహించిన ఈ ఓటింగ్ ప్రక్రియలో ఈ బిల్లుకు అనుకూలంగా సభలో ఉన్న 215 మంది మద్దతు తెలిపారు.
ఇప్పటికే మంగళవారం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టగా.. బుధవారం దాదాపు 8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి ఓటింగ్ నిర్వహించారు. ఇందులో సభలో ఉన్న 456 మంది సభ్యుల్లో 454 మంది ఎంపీలు ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపగా.. కేవలం ఇద్దరు ఎంఐఎం ఎంపీలు మాత్రమే వ్యతిరేకిస్తూ ఓటు వేశారు. ఇక పార్లమెంటు ఉభయ సభలు ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేయగా.. ఇక చివరి అంకం మాత్రమే మిగిలి ఉంది. ఈ బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ వద్దకు పంపించనున్నారు. రాష్ట్రపతి సంతకంతో ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు కాస్త మహిళా రిజర్వేషన్ల చట్టంగా మారనుంది.
ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు రెండు సభల్లో ఆమోదం లభించడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ బిల్లుకు మద్దతు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభలో చేపట్టిన చర్చలో ఉభయ సభల నుంచి వివిధ పార్టీలకు చెందిన 132 మంది సభ్యులు మాట్లాడినట్లు నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ సుదీర్ఘ చర్చలోని ప్రతి పదం రాబోయే రోజుల్లో అందరి సభ్యులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వెంటనే అభినందనలు తెలిపిన వారిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు. షా గతంలో “సంకల్పం ఉన్నచోట ఒక మార్గం ఉంటుంది” అని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్ నెరవేరిందని, లింగ సమానత్వం, సమ్మిళిత పాలన అనే బలమైన సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోదీ పంపారని అన్నారు.
పార్లమెంటు ఉభయసభల్లోనూ ఈ చరిత్రాత్మక బిల్లుకు ఆమోద ముద్ర పడటంతో 1996 లో అప్పటి ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ మహిళా రిజర్వేషన్ల బిల్లు.. దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఆమోదానికి నోచుకున్నట్లయింది. రాజ్యాంగ 128వ సవరణ బిల్లు ఈ మహిళా రిజర్వేషన్ల అంశానికి సంబంధించినది. ఈ బిల్లు ప్రకారం లోక్ సభ, అసెంబ్లీలో మూడోవంతుకు సమానమైన సీట్లను మహిళలకు కేటాయించాలి. అందులో మూడో వంతు సీట్లను ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు చెందిన మహిళలకు కేటాయించాలి. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలు, ఢిల్లీ అసెంబ్లీలలో మహిళలకు రిజర్వ్ అయిన సీట్ల రొటేషన్.. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అనంతరం ప్రారంభమవుతుంది.