సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ‘పుష్ప 2’ మూవీపై షాకింగ్ కామెంట్లు చేశారు. రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్ ప్రధాన పాత్రధారల్లో నటించిన ‘హరికథ’ వెబ్ సిరీస్ ప్రెస్ మీట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. కలియుగంలో వస్తున్న కథలు మరీ దారుణంగా ఉంటున్నాయంటూ విమర్శించారు. ‘నిన్న గాక మొన్న చూశా.. వాడెవడో చందనం దుంగల దొంగ… వాడు హీరో అంట! హీరోయిజానికి మీనింగ్స్ మారిపోయాయి.’ అంటూ అల్లు అర్జున్ పుష్ప-2 సినిమాను ఉద్దేశించి రాజేంద్ర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
48 ఏళ్ల తన కెరీర్‌లోపెద్ద ఎన్టీఆర్ నుంచి చిన్న ఎన్టీఆర్ దాకా ఐదు తరాల హీరోలతో నటించానని, ఇలాంటి పాత్ర చేయడం తన అదృష్టంగా భావిస్తున్నాంటూ చెప్పుకొచ్చారు. అలాగే వెయ్యి రూపాయలు పెట్టి చూడాల్సిన అవసరం లేదంటూ తనకున్న కడుపుమంటను కూడా బహిరంగంగా వెల్లడించారు రాజేంద్రప్రసాద్.
ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ కూతురు ఆకస్మిక మరణం తర్వాత ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన అతి కొద్ది మంది స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. అలాంటిది అల్లు అర్జున్ సినిమాపై ఇలా కామెంట్లు చేయడం కరెక్ట్ కాదని కొందరు అంటుంటే… రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు, సినిమా గురించి మాత్రమేనని, అల్లు అర్జున్ గురించి కాదని మరికొందరు అంటున్నారు.
‘పుష్ప 2’ మూవీ బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లు కొల్లగొడుతోంది. అయితే ఈ మూవీకి ప్రశంసలు ఎంతలా దక్కుతున్నాయో, విమర్శలు కూడా అంతే లెవెల్‌లో వస్తున్నాయి. ‘పుష్ప 1’ విషయంలో కూడా ఇదే జరిగింది. ‘పుష్ప 1’కి నేషనల్ అవార్డు రావడం కూడా వివాదాస్పదమైంది.. ఓ స్మగ్లర్ క్యారెక్టర్ చేసిన వ్యక్తికి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వడం కరెక్ట్ కాదని ట్రోల్స్ వచ్చాయి. మొన్నటి మొన్న ఏపీ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా అడవులను నరికే స్మగ్లర్లను హీరోలుగా చూపిస్తున్నారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాజాగా రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.