AICC అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి KTR ప్రశ్నలవర్షం కురిపించారు. పార్లమెంట్‌లో ఒకలా.. తెలంగాణ అసెంబ్లీలో మరోలా కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించవద్దని హితవు పలికారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. పార్లమెంట్‌లో అదానీ-మోదీ ఫొటో ఉన్న టీ షర్ట్ ధరించడం సరైనదే అయితే.. మీ అడుగుజాడల్లో నడిచి తెలంగాణ అసెంబ్లీలో అదానీ-రేవంత్ వ్యవహారాన్ని బయటపెట్టడానికి తమకు ఎందుకు అనుమతి లేదని రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. అదానీ, రేవంత్‌రెడ్డి ఫొటోతో ఉన్న టీషర్ట్ ధరించి అసెంబ్లీకి వెళ్తే తప్పేంటని… ఏ దుస్తులు వేసుకుని రావాలో స్పీకర్ చెబుతారా అని ప్రశ్నించారు. అదానీ, మోదీ ఫొటో ఉన్న టీషర్ట్ ధరించి రాహుల్‌గాంధీ పార్లమెంటులోకి వెళ్తే ఆయనను ఎవరూ అడ్డుకోలేదన్నారు. తాము రాహుల్‌గాంధీనే అనుసరించాం… కానీ, ఎందుకు అనుమతించటం లేదని కేటీఆర్ నిలదీశారు.