కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణలో పర్యటించబోతున్నారని.. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లాలో సభ నిర్వహించబోతున్నామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో ఆయన చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు.
హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నామని.. గ్రేటర్ హైదరాబాద్ మీద దృష్టి పెట్టామన్నారు. జీహెచ్‌ఎంసీలో అత్యధిక సీట్లు గెలిచి.. మేయర్ పీఠం మరోసారి కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. గాంధీ కలలు కన్న సమానత్వం కోసం పథకాలు అందిస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షాలు కులగణనను అడ్డుకోవాలని చూసినా పూర్తి చేశామని.. ఫిబ్రవరి 5న కుల గణన రిపోర్ట్ క్యాబినెట్ సబ్ కమిటీ.. క్యాబినెట్‌కి అందజేస్తుందని వివరించారు. రిజర్వేషన్ పెంపుపై క్యాబినెట్‌లో చర్చించి.. లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణ మీద నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
కుల గణన స్వతంత్ర భారతదేశంలోనే చరిత్రాత్మకమన్నారు. అధికారిక యంత్రాంగానికి క్లారిటీ లేక స్కీంలు ఆలస్యం అవుతుందని స్పష్టం చేశారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ” రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి తెచ్చిన నిధులు.. ప్రాజెక్టులు ఎన్ని..?. కానీ ఇవాళ బీజేపీ కార్పొరేటర్లు బిక్షాటన చేస్తుండటం విడ్డూరం. కాంగ్రెస్ దూరదృష్టితో విదేశీ కంపెనీల నుంచి పెట్టుబడులు పెట్టాం. బీఆర్ఎస్ హయాంలోనే రియల్ ఎస్టేట్ పడిపోయింది.. దానిని మా ప్రభుత్వం గాడిన పెడుతుంది. బీఆర్‌ఎస్ మాదిరి హామీలు అమలు చేయకుండా వదిలి వేయం. ఆలస్యం అయినా ఒక్కొక్కటి అమలు చేస్తాం.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఇప్పటికే ముగ్గురు అభ్యర్థుల పేర్లతో అధిష్టానానికి నివేదిక ఇచ్చాం. రెండు మూడు రోజుల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తాం. అన్ని సౌకర్యాలు ఉన్న పాత సెక్రటేరియట్ ఎందుకు కేసీఆర్ కూల్చారు. సమయాభావం దృష్టిలో పెట్టుకొని కమాండ్ కంట్రోల్ సెంటర్, సీఎం నివాసంలో సమీక్షలు చేస్తున్నారు అందులో తప్పేం ఉంది.
రాహుల్ గాంధీ సభ ఫిబ్రవరి 2వ వారంలో సూర్యాపేట జిల్లాలో నిర్వహించబోతున్నాం. ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారిక నివాసంలో సీఎం ఫోటోతో పాటు.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే ఫోటోలు పెట్టుకోవాలని సూచిస్తున్నాం. రాజగోపాల్ రెడ్డి వాఖ్యలు వక్రీకరించారు. కేసీఆర్ పదేళ్లు పాలించాడు.. ఉద్యమ నాయకుడిగా ఆయన్ను ప్రజలు అభిమానిస్తారు. కానీ పాలన గాడిన పెట్టలేకపోయారు. అధికారం దుర్వినియోగం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్నంత అభిమానులు ఎవ్వరికీ లేరు.
పదేళ్లలో కేసీఆర్ చేసిన రుణమాఫీ సొమ్ము ఎంత..?. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన రుణమాఫీని పోల్చి చూడండి. ఫాం హౌస్ పాలన కోరుకునేది దొరలు మాత్రమే. కేటీఆర్, హరీష్ రావు, కవిత రాజకీయ ముఖచిత్రంలో ఉండేందుకు..అస్థిత్వం కోసం కామెంట్స్ చేస్తున్నారు”.. అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.