బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఛాంపియన్‌గా నిలబెట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారా? బంతిని కేంద్రంలోని బీజేపీ కోర్టులోకి నెట్టేయాలనే ప్లాన్ చేస్తున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవుననే అంటున్నాయి. పంచాయతీలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో చట్టబద్దత కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఒక రోజు దీక్ష చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారట. ఈ దీక్షలో తానొక్కడే పాల్గొనకుండా.. మిత్రపక్షాలు, ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులను కూడా తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నారట. ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్నీ రాజకీయపార్టీలను ఢిల్లీకి వెళ్లి.. ప్రధాని నరేంద్రమోడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలని రేవంత్ భావిస్తున్నారట.
వాస్తవానికి 2023 ఎన్నికల సమయంలో కామారెడ్డిలో జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి ఈ 42 శాతం రిజర్వేషన్లపై హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక.. ఈ రిజర్వేషన్లపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. రిజర్వేషన్లు ఎప్పటి నుంచి అమలు చేస్తారని డిమాండ్ చేస్తున్నాయి. అయితే కులగణన చేస్తే కానీ బీసీ రిజర్వేషన్లు తేల్చలేమని రేవంత్ సర్కారు కొన్నాళ్లుగా చెబుతూ వచ్చింది. ఇప్పుడు కులగణన కూడా పూర్తయ్యింది, మొత్తంగా 56 శాతం మంది బీసీలు ఉన్నట్లు లెక్కతేలింది. అయితే ఈ కులగణనలో అనేక మంది ప్రజలు దూరంగా ఉన్నారని.. ఇదంతా బోగస్ అని ప్రతిపక్షాలు ఆరోపించాయి.
ప్రతిపక్షాల ఆరోపణలను కాస్తా సీఎం రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా మార్చుకున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశం మరి కొంత కాలం పొడిగించేలా.. మరోసారి కులగణన నిర్వహిస్తామని.. గతంలో సర్వేలో పాల్గొనని వారు ఇప్పుడు పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ నెలాఖరు వరకు కులగణన మొత్తం పూర్తవుతుంది. ఆ తర్వాత తెలంగానలో ఏ కులాల జనాభా ఎంతనే విషయం కచ్చితంగా తేలుతుంది. ఆ వెంటనే నివేదికను కేబినెట్‌లో ఆమెదించి.. అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని రేవంత్ భావిస్తున్నారు. మార్చి మొదటివారంలో నాలుగురోజులు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. ఈ సమావేశాల్లో కులగణనకు అసెంబ్లీ తీర్మానం చేయించటంతో పాటు ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేయించటమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
రిజర్వేషన్ల అంశం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. రిజర్వేషన్లు పెంచాలన్నా.. తగ్గించాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుది. అందుకే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని భావిస్తున్నారు. దీంతో రిజర్వేషన్ల అంశం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోర్టులోకి వెళ్లిపోతాయి. దీన్ని ఆమోదించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. అంతే కాకుండా పార్లమెంటులో బిల్లు పెట్టాలంటూ జంతర్ మంతర్ దగ్గర ఏకంగా సీఎం ధర్నాకు కూడా దిగాలని భావిస్తున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాల వెనుక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉన్నట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని ఆయన ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపితే.. బీసీ రిజర్లేషన్లపై దేశవ్యాప్తంగా చర్చ మొదలవుతుంది. ఇలా ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని భావిస్తోంది. కేంద్రం ఓకే చేసినా, ఓకే చేయకున్నా.. అంతిమంగా అది కాంగ్రెస్ పార్టీకే ప్లస్ కానుంది.
బీసీ రిజర్వేషన్లు, కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రేవంత్ రెడ్డి తలపెట్టిన ధర్నాకు ప్రతిపక్షాలు హాజరు కావడం అసాధ్యమైన పనే. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్.. కాంగ్రెస్‌కు లబ్ది చేకూర్చే అంశంలో మద్దతు ఇవ్వదు. అయితే బీఆర్ఎస్ మద్దతు ఇవ్వకుంటే దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ కూడా బావిస్తోంది. మొత్తంగా బీసీ రిజర్వేషన్లు, కులగణన, ఎస్సీ వర్గీకరణను పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలే చేస్తుంది. మరి ఇది ఏ మేరకు పార్టీకి ప్లస్‌గా మారుతుందో వేచి చూడాలి.