స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు సినీ ప్రేక్షకుల ఆరాధ్యదైవం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరించనున్నారు. ఖమ్మం జిల్లా లకారం ట్యాంక్ బండ్ మధ్యలో శ్రీకృష్ణావతారంలో ఉన్న 45అడుగుల ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని నిర్మించారు. ఎన్టీఆర్ శతజయంతి రోజున మే28న ఈ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ తో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భేటీ అయి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించారు.
దేశ, విదేశాల్లోని ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకకు తారక్ తో పాటు సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌తోపాటు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరుకానున్నారు. సుమారు రూ.4కోట్ల వ్యయంతో ఏర్పాటుకానున్న ఎన్టీఆర్ విగ్రహంతో ఖమ్మం నగరానికి మరింత శోభను తెస్తుందని స్థానికులు భావిస్తున్నారు.