స్వతంత్ర వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిపై ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. 24 మంది సభ్యులతో పాలకమండలిని ప్రకటించింది. అయితే ఇందులో కొందరి పేర్లపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. టీటీడీ బోర్డు రాజకీయ పునరావాస కేంద్రమేనని ఏపీ సీఎం జగన్ మరోసారి నిరూపించారని పురందేశ్వరి విమర్శలు గుప్పించారు.
ఢిల్లీలో మద్యం కుంభకోణంలో పాలుపంచుకున్న శరత్ చంద్రారెడ్డి, అవినీతికి పాల్పడినట్లు గుర్తించి ఢిల్లీ హైకోర్టు ఎంసీఐ నుంచి తొలగించిన కేతన్ దేశాయ్ వంటి వ్యక్తులను టీటీడీ బోర్డుకు నామినేట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. టీటీడీ బోర్డు, తిరుమల ఆలయ పవిత్రతపై ఏపీ సీఎం జగన్‌కు నమ్మకం లేదని విమర్శించారు. టీటీడీ పవిత్రను మసకబరిచే నియామకాలను బీజేపీ ఖండిస్తుందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే, కొన్ని వారాల క్రితం టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమించిన సందర్భంలో పురందేశ్వరి స్పందిస్తూ. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ పదవి అనేది రాజకీయ పునరావాస పదవి కారాదు అని అన్నారు. హిందూ ధర్మంపై నమ్మకం ఉన్నవాళ్లే టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి న్యాయం చేయగలరని అన్నారు. టీటీడీ చైర్మన్ పదవికి హిందూ ధర్మంపై నమ్మకమున్న వారిని, అనుసరించే వాళ్లని నియమించాలని డిమాండ్ చేశారు.