ప్రధాని నరేంద్రమోదీ మరో రికార్డ్ సాధించారు. ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన నాయకుల్లో ప్రధాని మోదీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తాజాగా ఆయనను ట్విట్టర్ లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 100 మిలియన్లు దాటింది. దీంతో మోదీ తన ప్రొఫైల్ స్క్రీన్ షాట్ తీసి ట్వీట్ చేస్తూ.. తన సంతోషాన్ని నెట్టింట పంచుకున్నారు. ప్రజలతో తన అభిప్రాయాలు పంచుకోడానికి ఇదో గొప్ప వేదిక అని వెల్లడించారు. భవిష్యత్‌లోనూ ఇదే స్థాయిలో తనను ఆదరిస్తారని ఆకాంక్షించారు.
2009 లో ప్రధాని మోడీ ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. నేటికి 10 కోట్ల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుని ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న రాజకీయ నేతగా నిలిచారు. ఇలా పదికోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న నేత ప్రపంచంలోనే లేరు. ఆ తరవాతి స్థానంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉన్నారు. ఆయనకు X లో 38.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తర్వాత దుబాయ్ యువరాజు షేక్ మహమ్మద్ 11.2 మిలియన్ ఫాలోవర్స్‌తో బైడెన్ తరవాతి స్థానంలో ఉన్నారు.


