Hyderabad Parking Issue |పల్లె తల్లి వంటిది. పట్టణం ప్రియురాలు వంటిది అనే సామెత గుర్తుండే ఉంటుంది. జేబు ఎంత నిండుగా ఉన్నా.. ప్రియురాలిని కలిస్తే జేబు ఖాళీ అవ్వాల్సిందే.. ఇది అందరికి తెలిసిందే.. సేమ్ టు సేమ్ సిటీల పరిస్థితి అలానే ఉంది. బండి పార్కింగ్ మొదలు మూత్రం పోయాలన్న డబ్బులు కట్టాలి.. అది ప్రస్తుతం నగరాల్లో పరిస్థితి.. కాని బతుకుదెరువు కోసం వాటన్నింటిని భరించాల్సి వస్తోంది. ప్రస్తుతం నగరాల్లో వేతన జీవుడి పరిస్థితి ఎలా ఉందో మీరే తెలుసుకోండి..
హైదరాబాద్ మహా నగరానికి ఒక రిటైర్డ్ దంపతులు వచ్చారు. తమ కూతురు, అల్లుడు ఇక్కడే ఉన్నారు. వారి అవసరాలు వారివి, వీరి కష్టాలు వీరివి… మొత్తానికి పడుతూ లేస్తూ కుమార్తె ఇంటికి చేరారు. ఒకరోజు తర్వాత భార్యాభర్తలిద్దరు చిన్న మారుతీ కారు తీసుకుని మహా నగరంలోకి వచ్చారు. ఒక దగ్గర కూరగాయలు కొనాలని అనుకున్నారు. కానీ కారు పార్క్ చేసే స్థలం కనిపించలేదు. ఇటూ అటూ ఒక నిమిషం చూసేసరికి, వెనక నుంచి అదే పనిగా హారన్ల మోత…మెదడు ఛిన్నాభిన్నం అయిపోతుంటే… భార్యామణికి కోపం వచ్చింది.
‘‘ముందుకి పోనివ్వండి…అక్కడేమైనా ఉంటే చూద్దాం’’ అన్నాది
దాంతో కారుని నెమ్మదిగా ముందుకి తీసుకువెళ్లాడు. ఆ భర్త శిఖామణి.
వీళ్ల పక్క నుంచి వెళుతున్న వాహనదారులందరూ…దేశద్రోహం నేరం చేసినట్టుగా కొరకొరా చూస్తూ వెళుతున్నారు.
‘ఎందుకొస్తార్రా…మమ్మల్ని చంపడానికి…’’ అని ఒకడు అననే అన్నాడు.
చిన్న పొరపాటు జరిగితే, మాటలతో కుళ్ల పొడిచేయడానికి పక్కనే రెడీగా ఉంటారు. గొప్ప సమాజం రా బాబూ… అని మనసులో ఆ పెద్దాయన అనుకున్నాడు. సరే…ఎప్పుడూ వినలేని మాటలు వింటూ, పడరాని పాట్లు పడుతూ కారుని టెన్షన్ గా నడుపుతూ దూరంగా ఒక పార్కింగ్ చోటు కనిపిస్తే… ఎడారిలో ఒయాసిస్సు కనిపించినంత ఆనందంగా అక్కడికి వెళ్లి…కారు పార్క్ చేసి నెమ్మదిగా దిగారు…
అది ఒక మాల్ కి సంబంధించిన పార్కింగ్. సరే, ఎక్కడో కొనడం ఎందుకు? ఇక్కడే కొందామని లోపలికి వెళ్లి మళ్లీ బయటకు వచ్చారు. కారు దగ్గరికి వచ్చి చూస్తే…అక్కడ ఫైన్ వేయడానికంటూ ఒకరు రెడీగా ఉన్నారు. ఎవరంటే అక్కడ మాల్స్, వాణిజ్య సంస్థల యాజమాన్యాల నిబంధనలంట. ఉచిత పార్కింగ్ 30 నిమిషాల వరకే…అది దాటితే ఫైన్ తప్పదని ఒక రిసీప్ట్ ఇవ్వడానికి అతను రెడీ అవుతున్నాడు.
‘‘ఇది అన్యాయం- అక్రమం’’ అని ఆ పెద్దాయన అన్నాడు.
‘‘మేం మీ మాల్ లో సరుకులు కొన్నాం…ఇంకా మాకు సమయం ఉంది’’ అని రిసీప్ట్ లు చూపించారు.
‘‘అవన్నీ మాకు తెలీదు. ఫైన్ కట్టాల్సిందే’’ అని గదమాయించాడు
‘‘కంప్లయింట్ చేస్తాం’’ అన్నాడు పెద్దాయన
‘‘ఇంకా మేం నయమే సార్…చాలా చోట్లా 30 నిమిషాలు ఫ్రీ కూడా లేదు…తెలుసా?’’ అన్నాడు
‘‘ అవన్నీ కాదు… మూడు గంటలు దాటితేనే ఫైన్ వేయాలి.
అరగంట, గంటకే ఫైన్లు వేస్తే ఎలా?’’ అని పెద్దాయన ప్రశ్నించాడు. ఎన్ని ప్రశ్నలు వేసినా ఉపయోగం లేక ఫైన్ కట్టి వచ్చాడు.
ఇలాంటివెన్నో సంఘటనలు…సిటీలో జరుగుతున్నాయి. అడ్డగోలు పార్కింగ్ ఫీజులపై జీహెచ్ఎంసీకి చాలా ఫిర్యాదులు వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉచితంగా పార్కింగ్ పాలసీ అమలుచేయాలని, ఇందుకోసం సర్కిళ్ల వారీగా స్పెషల్ డ్రైవ్ లు చేపట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధిస్తామంటూ మాల్స్, మల్టీప్లెక్స్, వాణిజ్య సంస్థలకు ఎన్ ఫోర్స్ మెంట్ మేనేజ్ మెంట్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ విభాగం నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే కూకట్ పల్లి జేఎన్టీయూ దగ్గర మంజీరా మెజిస్టిక్ కమర్షియల్ కాంప్లెక్స్ కు ‘ఈవీడీ విభాగం’ రూ.50 వేల జరిమానా విధించింది. ఇదంతా ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా ఒక వాహనదారుడి నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయడమే అందుకు కారణం. అందుకే ప్రజలు కూడా స్పందించి ఫిర్యాదులు చేస్తేనే మేం చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.