స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ మరికాసేపట్లో రాష్ట్రానికి రానున్నారు. మహబూబ్ నగర్ లో ప్రధాని పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి హైదరాబాద్ గోడలపై మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ పోస్టర్లు వెలిశాయి. గుర్తుతెలియని వ్యక్తులు అంటించిన ఈ పోస్టర్లలో మోదీకి వ్యతిరేకంగా రాతలు కనిపిస్తున్నాయి. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్న మోదీకి రాష్ట్రంలో పర్యటించే నైతిక హక్కు లేదని ఇంగ్లిష్ లో రాశారు.
ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు.. కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇచ్చారు.. మరి తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడంలేదని ఈ పోస్టర్ల ద్వారా మోదీకి ప్రశ్నలు సంధించారు. జాతీయ హోదా విషయంలో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేసిందని ఆరోపించారు. ఇది సవతి తల్లి ప్రేమేనని ఆరోపిస్తూ మోదీకి మహబూబ్ నగర్ లో పర్యటించే నైతిక హక్కులేదని విమర్శించారు.