స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో మరోసారి ఫ్లెక్సీల కలకలం రేగింది. ఇప్పటివరకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఫ్లెక్సీ వార్ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. గట్టి భద్రత ఉండే బీఆర్ఎస్ భవన్, ప్రగతి భవన్ ఎదుట ఈ పోస్టర్లు దర్శనమివ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడే కాకుండా నగరంలో మరికొన్ని చోట్ల గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్స్ ఏర్పాటుచేశారు.
‘మాకు న్యాయం చేయండి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, మీడియా సంస్థల అధినేతలకు విన్నపం. స్త్రీలకు రక్షణ కల్పించాలి, బాధితులకు న్యాయం చేయాలి. దుర్గం చిన్నయ్య లాంటి కామ పిశాచి బారి నుండి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలను కాపాడండి.. ఆరిజిన్ డెయిరీ’ అంటూ పేర్కొన్నారు. దీంతో ఈ పోస్టర్లు నగరంలో చర్చనీయాంశంగా మారాయి.
కాగా గత రెండు నెలలుగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆరిజన్ డెయిరీ, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మధ్య వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే. దుర్గం చిన్నయ్య తమను వేధిస్తున్నాడంటూ ఆరిజన్ డెయిరీకి చెందిన ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు. ఈ వివాదం కొనసాగుతూ ఉండగానే రాత్రికి రాత్రే నగరంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోస్టర్స్ ప్రత్యక్షమవ్వడం సంచలనంగా మారింది.