ఇల్ హెల్త్ తో హెల్ అనుభవిస్తున్న సమయంలో ప్రముఖ రచయిత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న పోసాని, ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఆయనను సబ్ జైలు నుంచి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. ఆసుపత్రి పీసీ యూనిట్ వైద్యాధికారి వికాస్, పోసానికి ఈసీజీతో పాటు, మరికొన్ని రక్తపరీక్షలు నిర్వహించారు. బీపీతో పాటు ఈసీజీలో తేడాలు ఉండడంతో, టూ డీ, ఎకో పరీక్షల నిమిత్తం కడప రిమ్స్ కు రిఫర్ చేశారు.
గతంలో ఆయనకు గుండె నొప్పి రావడంతో వైద్యులు స్టంట్ వేశారు. కొంత కాలం క్రితం స్టమక్ ఇన్ ఫెక్షన్ సోకడంతో వైద్యం చేయించుకున్నారు. అనంతరం ఎడం భుజం నొప్పి, గొంతు నొప్పితో బాధపడుతూ.. మాట్లాడడానికి సైతం ఇబ్బంది పడుతున్నారు. గ్యాస్టిక్ ట్రబుల్, అబ్డామిన్ హెర్నియా, హెర్నియా సర్జరీ అనంతరం వెన్నునొప్పి, మూడుసార్లు వోకల్ సర్జరీ.. ఇన్ని బాధలు ఆయన ఎదుర్కొంటున్నారు. సరిగ్గా.. ఈ సమయంలో అరెస్ట్ తో ఆయనపై మరిన్ని కష్టాలు కట్టకట్టుకొచ్చినట్టయ్యింది.
ఆయనేం నిశాని కాదు. ఆషామాషీ వ్యక్తి కాదు. ఎన్నో చలన చిత్రాలకు పోసాని రచయితగా సేవలందించారు. సినీ నటుడిగా కోట్లాది ప్రేక్షకుల అభిమానం పొందారు. అయితే, ఇదివరలో ఆయన చేసిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు శాపంలా పట్టి పీడిస్తున్నాయని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, ఆయనకు ఆరోగ్యం చేకూరి, అన్ని కష్టాల నుంచి బయటపడాలని ఆయన అభిమానగణం కోరుకుంటోంది.