సీఎం రేవంత్ రెడ్డి వనపర్తి పర్యటన అనంతరం సాయంత్రం నాగర్ కర్నూలు జిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పరిశీలనకు వెళ్లనున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి పరశీలించనున్నారు. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సొరంగంలో జరుగుతున్న సహాయక చర్యల తీరుపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో 9వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో చిక్కుకున్న 8మంది ఆచూకీ కోసం సహాయ బృందాలు తవ్వకాలు జరుపుతున్నాయి. ఇవాళ నలుగురిని వెలికితీసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే సహాయ బృందాల తవ్వకాలకు నిరంతరం ఊరుగుతున్న నీటి ఊట ఆటంకంగా మారుతోంది. కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రాకపోవడంతో పూడిక, కత్తిరించిన టీబీఎం భాగాలను తరలించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. షిఫ్ట్‌కు 120 మంది చొప్పున రోజుకు 3 షిఫ్టుల్లో రెస్క్యూ టీమ్స్ పనిచేస్తున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, హైడ్రా, సింగరేణి రెస్క్యూ టీమ్స్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. సహాయక చర్యల్లో 18 ఏజెన్సీలు, 700 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు. మరోవైపు జిపిఆర్ ద్వారా గుర్తించిన ప్రాంతాల్లో సహాయ చర్యలను మరింత వేగవంతం చేశారు.
రోజులు గడుస్తున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. బురద సిపేజ్ వాటర్ అడ్డంకిగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చిక్కుకున్న 8 మంది కార్మికులు దాదాపు బతికే చాన్స్ లేదని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు ఒక్క శాతమే ఉన్నా కూడా సొరంగంలో పరిస్థితిని పరిశీలిస్తే కష్టమేనని ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఇప్పటి వరకు జరిగిన సహాయక చర్యలు ఒక ఎత్తయితే.. ఇకపై వేసే ప్రతి అడుగూ ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు.
నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ఫిబ్రవరి 22న ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పైకప్పు కూలడంతో ప్రమాదం జరిగింది. మిగిలిన కార్మికులు తప్పించుకోగలిగినా.. టన్నెల్ బోరింగ్ మిషన్, కట్టర్‌ల మధ్య పనిచేస్తున్న వారు మాత్రం బయటపడలేకపోయారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున నీరు, మట్టి సొరంగంలోకి చేరడం.. టీబీఎం వెలుపలి భాగానికి చేరుకునే సమయం కూడా లేకపోవడంతో అక్కడే 8 మంది చిక్కుకుపోయారన్న అభిప్రాయం వినిపిస్తోంది. వారంతా సొరంగంలో మూడు మీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.