దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గాలి నాణ్యత రోజురోజుకు మరింత పడిపోతోంది. ఎయిర్‌క్వాలిటీ ఇండెక్స్‌పై 279 పాయింట్లుగా నమోదయింది. నగరంలోని అలీ పూర్, ఆనంద్ విహార్, అశోక్ విహార్, బవానా ప్రాంతాలు తీవ్రమైన కాలుష్యంలో ఉన్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. అలాగే చాందిని చౌక్, డీటీయు, ద్వారక, జహంగీర్ పురి, మందిర్ మార్గ్ లు కూడా అదే కోవలో ఉన్నాయని తెలిపింది.
ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కాలుష్య నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేస్తున్నారు అక్కడి అధికారులు. ప్రస్తుతం ఢిల్లీలో గ్రాప్ 4 ఆంక్షలు విధించారు. ఈ చర్యల్లో భాగంగా వారం రోజులుగా పాఠశాలకు మూతపడగా..నిర్మాణ కార్యకలాపాలు, డీజిల్ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోపక్క దట్టంగా వ్యాపించిన పొగమంచుతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న తీవ్రమైన వాయు కాలుష్యంతో వృద్ధులు, చిన్నారుల్లో శ్వాసకోశ సంబంధ సమస్యలు మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.