స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. రాష్ట్రంలోనే సింహపురి రాజకీయాలు వేరుగా ఉంటాయి. అక్కడ ఎక్కువ స్థానాలు గెలిచిన పార్టీనే అధికారంలోకి రావడం ఆనవాయితీగా ఉంది. మరోసారి జిల్లా పాలిటిక్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లా పరిస్థితులు అధికార పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారాయి. వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ముగ్గురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో టీడీపీ నేతలు మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, వేమిరెడ్డి పట్టాభి భేటీ అయి పార్టీలోకి ఆహ్వానించారు. మరోవైపు సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి హైదరాబాద్‌లో చంద్రబాబుతో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఆయనతో మంతనాలు జరిపారు. పార్టీలోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు బాబు వద్ద ప్రస్తావించారట. ఈ నెల 13న నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. అప్పటిలోగా వీరు పసుపు కండువా కప్పుకునేలా టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.