23.2 C
Hyderabad
Saturday, January 18, 2025
spot_img

తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయ వివాదం

తెలంగాణ తల్లి విగ్రహంపై రాజకీయ వివాదం నడుస్తోంది. ప్రస్తుతం ఉన్న విగ్రహం రూపాన్ని మారుస్తూ..కొత్త విగ్రహాన్ని ఈనెల 9వ తేదీన ఆవిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య కొద్దిరోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని దొరసానిలా రూపొందించారని కాంగ్రెస్ విమర్శిస్తుంటే..కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ మండిపడుతోంది. దీనిలో భాగంగానే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాలనే ప్రయత్నం చేస్తోందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఓ సాధారణ మహిళలా తెలంగాణ తల్లిని రూపొందిస్తున్నామని కాంగ్రెస్ చెబుతుండగా..తెలంగాణ తల్లి రూపం ధనిక మహిళగా ఉంటే వచ్చే నష్టం ఏమిటని బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తోంది.

మరో మూడు రోజుల్లో కొత్త తెలంగాణ తల్లి రూపాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో కొత్త విగ్రహానికి సంబంధించిన రూపం బయటకు వచ్చింది. ఓ సాధారణ మహిళను తలపించేలా విగ్రహం ఉంది. గత విగ్రహానికి ప్రస్తుత విగ్రహానికి పోలికల్లో ఎన్నో తేడాలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహం రూపాలను మార్చడం సరికాదని బీజేపీ అంటోంది. ఇటీవల తెలంగాణ గేయం విషయంలోనూ వివాదం నెలకొన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పాత గేయం స్థానంలో కొత్త గేయాన్ని తీసుకొచ్చింది. తాజాగా తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం గత రూపాన్ని మారుస్తూ ఓ సాధారణ మహిళ రూపాన్ని తలపించేలా కొత్త రూపాన్ని రూపొందించింది.

విగ్రహ ఆకారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేవారు. తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని ఎందుకు మార్చారని అడిగారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వ నిర్ణయాలు మారిపోవాలా అని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన భారతమాత రూపాన్ని వాజ్ పేయి మార్చలేదని అన్నారు. ఒకప్పుడు సోనియాను బలిదేవత అన్న రేవంత్…ఇప్పుడు ఆమెను తెలంగాణ తల్లి అంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ ఎక్కడున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.

కేటీఆర్ వ్యాఖ్యలకు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. అధికారంలోకి వస్తే తెలంగాణ తల్లిని తీసివేస్తామని అంటున్నారని..గతంలో తెలంగాణ తల్లి విగ్రహం దొరలు, దొరసానులను తలపించే విధంగా ఉందని విమర్శలు గుప్పించారు. ప్రతి పక్ష నేత కేసీఆర్ ప్రజా పండుగకు, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు రావాలని కోరారు. పది ఏండ్లలో బీఆర్ఎస్ ఇవ్వలేని ఉద్యోగాలు..ఏడాది లోనే 50 వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్నారు. అన్ని రంగాలలో కాంగ్రెస్ మార్క్ పాలన కనిపిస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ పుట్టిన రోజు వేడుకలను ఈనెల 9న కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుందని చెప్పారు.

పాత తెలంగాణ తల్లి విగ్రహంలో తెలంగాణ తల్లి జరీ అంచు పట్టు చీర ధరించగా..కొత్త విగ్రహంలో పసుపు పచ్చ అంచుతో ఆకుపచ్చ చీర ధరించి ఉంది. పాత విగ్రహంలో తలకు కిరీటం, చేతిలో బతుకమ్మ ఉండగా..కొత్త విగ్రహంలో కిరీటం, చేతిలో బతుకమ్మ లేదు. గత విగ్రహంలో తెలంగాణ తల్లి చేతికి బంగారు గాజులు ఉండగా, ప్రస్తుతం మట్టి గాజులు ధరించి తెలంగాణ తల్లి విగ్రహం కనిపిస్తోంది. గత విగ్రహం రాజమాతలా ఉందనే విమర్శలు రాగా..కొత్త విగ్రహం సాధారణ మహిళ రూపాన్ని తలపిస్తోంది. పాత విగ్రహంలో వెండి మెట్టెలు, నగలు కిరీటం ఉండగా..కొత్త విగ్రహంలో మెడలో కంటి ఆభరణం మాత్రమే కనిపిస్తోంది. పాత విగ్రహంలో కుడి చేతిలో మక్క కంకులు ఉండగా..కొత్త విగ్రహం కుడి చేతిలో అభయ హస్తం కనిపిస్తోంది. పాత విగ్రహంలో ఎడమ చేతిలో బతుకమ్మ ఉండగా.. కొత్త విగ్రహంలో ఎడమ చేతిలో వరి, జొన్న, సజ్జ కంకులు ఉన్నాయి. రెండు విగ్రహాల రూపాలకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది.

డిసెంబర్ 9న రాష్ట్ర సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ జరగనుంది. ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మొదటగా విగ్రహ ఆవిష్కరణను సోనియా గాంధీతో చేయించాలనుకున్నారు. ఆమె అనారోగ్యం కారణంగా రాలేకపోతున్నట్లు సమాచారం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట వద్ద చేయించారు.

Latest Articles

సింగపూర్ పర్యటనలో బిజీ బిజీగా సీఎం రేవంత్

సింగపూర్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సింగపూర్ పర్యావరణ మంత్రి గ్రేస్ ఫూ హై యూన్‌ను కలిశారు. వివిధ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చలు జరిపినట్లు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్