ఇవాళ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం. వన్యప్రాణులను కాపాడాలంటూ ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక అడుగు ముందుకేసి అభయారణ్యంలోనే పర్యటిస్తున్నారు.
గుజరాత్‌లోని గిర్ అభయారణ్యంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం రోజు మోదీ లయన్ సఫారీ చేపట్టారు. కెమెరా పట్టుకుని అడవంతా కలియతిరిగారు ప్రధాని. ఆయన వెంట కొందరు మంత్రులు, ఫారెస్ట్ అధికారులు ఉన్నారు. గిర్ అడవుల్లో ప్రధాని మోదీ సింహాల ఫోటోలు తీశారు. జీవ వైవిధ్య పరిరక్షణకు కట్టుబడి ఉండాలి అంటూ తన సందేశాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ భూమి మీద ప్రతి జీవ జాతిది కీలక పాత్ర అని.. భావితరాల కోసం వాటిని పరిరక్షించాలని ప్రధాని పిలుపునిచ్చారు. వన్యప్రాణాలు పరిరక్షణ అవసరాన్ని చాటిచెబుతూ ఒక వీడియోని కూడా పోస్ట్ చేశారు.
గిర్‌లో ప్రాజెక్ట్ లయన్
గుజరాత్ ఏకైక నివాసంగా .. ఆసియా సింహాల సంరక్షణ కోసం కేంద్రం గుజరాత్‌లోని గిర్ ల్యాండ్‌స్కేప్‌లో “ప్రాజెక్ట్ లయన్”ను అమలు చేసింది.
పెరుగుతున్న సింహాల సంఖ్యకు అనుగుణంగా ఆవాసాలను భద్రపరచడం, పునరుద్ధరించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. జీవనోపాధి ఉత్పత్తిని , స్థానిక సమాజాల భాగస్వామ్యాన్ని పెంచడం, పెద్ద పిల్లి వ్యాధుల నిర్ధారణ , చికిత్సపై ప్రపంచ జ్ఞాన కేంద్రంగా మారడం, ప్రాజెక్ట్ లయన్ చొరవ ద్వారా సమగ్ర జీవవైవిధ్య పరిరక్షణ లక్ష్యంగా ముందుకెళ్తుంది.
కేంద్రం గణాంకాల ప్రకారం.. గుజరాత్‌లో ఆసియా సింహాల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజా అంచనా ప్రకారం జూన్ 2020లో ఇది 674గా ఉంది. ఇక ఇది 2015లో 523 , 2010లో 411గా ఉంది.