బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో పలువురు దేశాధినేతలతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అక్కడ జరుగుతున్న జీ 20 సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో మోదీ భేటీ అయ్యారు. స్నేహితుడు, అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌ను కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు మోదీ. భారత్, ఫ్రాన్స్‌లు అంతరిక్షం, ఇంధనం, ఏఐ వంటి ఇతర రంగాలలో సన్నిహితంగా పనిచేయడంపై చర్చించామని చెప్పారు. ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను బలపరిచేందుకు పనిచేస్తామని మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్‌ను సమర్థంగా నిర్వహించారని మెక్రాన్‌ను ప్రశంసించినట్లు మోదీ తెలిపారు. ఈ సమావేశం భారత్- ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అభివర్ణించింది.
బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తోను మోదీ చర్చించారు. రాబోయే కాలంలో సాంకేతికత, గ్రీన్‌ఎనర్జీ, భద్రత, ఆవిష్కరణ వంటి రంగాల్లో బ్రిటన్‌తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నామని మోదీ తెలిపారు. వాణిజ్యంతో పాటు సాంస్కృతిక సంబంధాలను సైతం బలపరచాలనుకుంటున్నామని మోదీ స్పష్టం చేశారు. మరోవైపు ఇటలీ, యూకే, ఇండోనేషియా, నార్వే, పోర్చుగల్‌తో సహా పలు దేశాధినేతలతోను మోదీ సమావేశమయ్యారు.