స్వతంత్ర వెబ్ డెస్క్: వారాహి యాత్ర సందర్భంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన కార్యవరగా సమావేశంలో పాల్గొన్న జనసేనాధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తనకి ప్రాణహానీ ఉందని.. తనని చంపేందుకు కొంతమంది గుండాలకి ప్రత్యేక సుపారీ ఇచ్చారని.. తాను బ్రతికి ఉండాలంటే తనకి సెక్యూరిటీ తప్పనిసరి అని అందుకే సెక్యూరిటీని నియమించుకున్నాని తెలిపారు. తన వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు నన్ను ఎలా బ్రతికనిస్తారని బాంబు పేల్చారు.
“రాజకీయాల్లో పదవి పోతుందనే భయం చాలా చెడ్డది. తమకు హాని చేస్తారని తెలిస్తే, కడుపులోని బిడ్డను కూడా చంపేందుకు వెనుకాడరు. ప్రస్తుతం జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో బలంగా ఉంది. అధికారం నుంచి వైసీపీ పాలకులను గద్దె దించే దిశగా పయనిస్తోంది. ఇలాంటి సమయంలో వారు ఏం చేయడానికి అయినా సిద్ధంగా ఉన్నారు. నాకు ప్రాణహాని ఉంది. సుపారీ గ్యాంగులను ప్రత్యేకంగా దింపారనే సమాచారం ఉంది. కచ్చితంగా భద్రతా నియమాలను నాయకులతో పాటు జనసైనికులు, వీర మహిళలు తప్పనిసరిగా పాటించాలి. నేటి వైసీపీ పాలకులు అధికారం కోసం ఏం చేయడానికి అయినా సిద్ధమే. నన్ను భయపెట్టే కొద్దీ నేను మరింత రాటు దేలుతాను” అని పవన్ కళ్యాణ్ అన్నారు.
2019లో వైసీపీ అధికారంలోకి రాకపోతే.. తనని చంపేద్దామని అనుకున్నారని కుండబద్దలు కొట్టారు. తానేమీ కల్పించి ఈ వ్యాఖ్యలు చేయడం లేదని, అలాంటి రికార్డ్స్ తన వద్ద ఉన్నాయని.. ఇంటెలిజెన్స్ వర్గాల వారు తనకు రిపోర్ట్స్ పంపించారని షాకిచ్చారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని 34 సీట్లలో.. వైసీపీకి ఒక్క సీటు కూడా రాకూడదని పవన్ కళ్యాణ్ జనసైనికులకు పిలుపునిచ్చారు.
అంతకుముందు పిఠాపురంలో జరిగిన వారాహి విజయ యాత్రలో.. రాష్ట్ర ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ మాటల తూటాలతో విరుచుకుపడ్డారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో తన రెండు చెప్పులు బయట వదిలి వెళ్తే, అవి ఎవరో కొట్టేశారని.. చివరికి చెప్పులు కొట్టేసే స్థాయికి వైసీపీ ప్రభుత్వం వచ్చిందని నిప్పులు చెరిగారు. తిరుపతిని దోపిడీ చేస్తున్నారని.. ఏడు కొండలతో ఆటలు ఆడితే నామరూపాల్లేకుండా పోతారని హెచ్చరించారు. హిందూ దేవాలయాలపై ఈ ప్రభుత్వం కన్నేసిందని అన్నారు. తనకు అధికారం ఇవ్వాలని ప్రజల్ని అభ్యర్థించిన పవన్.. తాను సీఎం అవ్వడానికి సిద్ధంగా ఉన్నానని, తాను గెలవడానికి ఏ వ్యూహం అయినా వేస్తానని చెప్పుకొచ్చారు. పిచ్చివాడుగు వాగితే బయటకు తీసుకొచ్చి కొడతానని వార్నింగ్ ఇచ్చారు. తన జనసేన పార్టీ అధికారంలోకి వస్తే.. పిఠాపురంని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.