ప్రజాస్వామ్య దేవాలయంగా పిలిచే పార్లమెంటుపై దాడితో.. యావత్ భారతావని ఉలిక్కిపడింది. ఈ మొత్తం ఘటనను సీరియస్‌గా తీసుకున్న కేంద్రం.. అసలు ఎందుకిలా జరిగింది? దీనికి కారణాలు ఏంటి? అని వెతికే పనిలో పడింది. ఈ క్రమంలోనే దాడిలో పాల్గొన్న ఆరుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి వివరాలు రాబడుతున్నారు.
నిందితుల విచారణ సందర్భంగా కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. లోక్‌సభలో దొరికిపోయిన మనోరంజన్ అనే అతడే ఈ ఘటన మొత్తానికి కీలకమంటూ వెల్లడించాయి పోలీసు వర్గాలు. మనోరంజన్, సాగర్ శర్మ లోక్‌సభలోకి చొరబడగా…నీలమ్, అమెల్ శిండే పార్లమెంటు భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితోపాటు వీళ్లకు సహకరించిన విశాల్‌ను ఖాకీలు అదుపులోనికి తీసుకోగా.. లలిత్ అనే మరో వ్యక్తి పరారీలో
ఉన్నాడు.
అయితే.. దర్యాప్తు సాగుతున్న కొద్దీ పలు కీలక అంశాలు, మరెన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అందులో అత్యంత కీలకమైనది వేర్వేరు ప్రాంతాలకు చెందిన వీళ్లంతా ఒకేచోట ఎలా కలిశారు..? వీళ్లను కలిపిన భావజాలమేంటి ? అన్నవి ప్రధానంగా విన్పిస్తున్నాయి. ఎందుకంటే దాడి ఘటనలో ఉన్న నిందితులు దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారు. వారి చదువుకొన్న చదువులకు సైతం పోలిక లేదు. ఇక, వయసు రీత్యా 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న వాళ్లు.
అయితే… విచారణ మరింతగా సాగిన కొద్దీ వీరి మధ్య ఉన్నటువంటి ఒక కామన్ పాయింట్ బయటకు వచ్చింది. అదే వీరంతా సోషల్ మీడియాలో భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్‌లో సభ్యులు. అక్కడే వీరి అభిప్రాయాలు, అభిరుచులు కలిశాయి. ఒకరితో ఒకరు తమ ఆలోచనలు పంచుకున్నారని తెలుస్తోంది. ఇందులో నీలమ్ ఆజాద్, అమోల్ షిండే నిరుద్యోగులు. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఉద్యోగాలు రాకపోవడంతో విసిగిపోయారు.
స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ భావజాలంతో వీరంతా ప్రేరణ పొందినట్లు భావిస్తున్నారు. ఆ కోణంలోనే పార్లమెంటులో పొగ బాంబు వదిలినట్లు అనుమానిస్తున్నారు. ఎందుకంటే… స్వాతంత్రోద్యమ సమయంలో విప్లవకారుల చర్యలను అణచి వేసే దిశగా భారత రక్షణ చట్టాన్ని తీసుకురావడం ద్వారా పోలీసులకు బ్రిటీష్ ప్రభుత్వం మరింత అధికారం కల్పించింది. భగత్ సింగ్ లాంటి విప్లవకారులను అణచివేయడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. దాన్ని వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 8, 1929న భగత్‌సింగ్‌తోపాటు మరో విప్లవకారుడు దత్ కలిసి నాటి శాసనసభ వసారాపై బాంబు విసిరారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అని అరుస్తూ కరపత్రాలు వెదజల్లారు. ఆ తర్వాత ఆ బాంబు గాయపరిచేంత శక్తివంతమైనది కాదని బ్రిటీష్ ఫోరెన్సిక్ విచారణాధికారులు తేల్చిచెప్పారు. ఇలాంటి అంశాలను సోషల్ మీడియాలో చదివి ప్రేరణ పొందిన వీరు సరిగ్గా అదే మాదిరిగా చేసినట్లు భావిస్తున్నారు.
దాడిలో పాల్గొన్న వాళ్లు, సహకరించిన వాళ్లు అంతా ఉన్నత విద్యా వంతులు, పైగా ఆయా అంశాల్లో తమ వంతుగా అన్యాయాలను ఎదిరించిన వాళ్లు, ఉద్యమాలు, పోరాటాలు చేసిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ప్రత్యేకించి నీలమ్ ఐదు డిగ్రీలు చదివింది. బీఏ, ఎంఏ, ఎంఫిల్, పూర్తి చేసింది. అంతేకాదు.. గతంలో వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హస్తిన సమీపంలో జరిగిన రైతుల నిరసనలో సైతం పాల్గొన్నట్లు తెలుస్తోంది. మరి ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న వీళ్లంతా ఇలా ఎందుకు చేశారంటే వాళ్లు చేసిన నినాదాలు, పోలీసుల విచారణలో చెప్పిన అంశాలతో కొంత మేర క్లారిటీ వస్తోంది. దేశంలో ప్రస్తుతం అనేక సమస్యలు నెలకొన్నాయి. ప్రధానంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మణిపూర్ వ్యవహారం సహా అనేకం వీరిని ఆలోచింపచేశాయి. వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వీళ్లు తమ వాణిని బలంగా విన్పించాలని ప్రయత్నించారు. ప్రపంచం దృష్టికి తీసుకెళ్లాలని భావించారు. అయితే.. అందుకోసం తమకు తోచిన రీతిలో ప్రయత్నించారు. అదే వారిని ఇబ్బందుల్లోకి నెట్టింది. తీవ్ర నేరానికి దారి తీసింది. మొత్తంగా కారణాలేవైనా వీళ్లు చేసిన పని మాత్రం… ఏ రకంగానూ క్షమార్హమైంది కాదన్న వాదన విన్పిస్తోంది.