వికారాబాద్ జిల్లా చీలాపూర్ పంచాయతీ కార్యదర్శి అవినీతి బాగోతం బయటపడింది. ఇళ్ల నిర్మాణ అనుమతుల కోసం భారీగా ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఏడాదిన్నర కిందట చీలా పూర్ గ్రామానికి పంచాయతీ కార్యదర్శి గా నియమితులైన మొగులయ్య… గ్రామంలో నూతన ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ నిబంధనలకు మూడింతలు అధికంగా వసూలు చేసినట్టు గ్రామస్తులు ఆరోపిస్తు న్నారు. ఆన్లైన్ రేటు ఒకటైతే…. కార్యదర్శి రేటు మరోలా ఉంటుందని గ్రామస్తులు చెబుతు న్నారు. వాస్త వానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇళ్ల నిర్మాణ అనుమతులకు రూ.7 వేల నుంచి రూ.10వేల మధ్య పంచాయతీకి చెల్లించాల్సి ఉండగా …. చీలాపూర్ పంచాయతీ కార్యదర్శి మాత్రం అంతకు మూడింత లు వసూలు చేస్తున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. నగదు రూపంలోనే డబ్బులను తీసుకుంటూ బయటపడేవాడని, అయితే కొందరు ఆయనకు ఫోన్‌పే రూపంలో డబ్బులు వేయడంతో కార్యదర్శి భాగోతం బయటపడింది. గ్రామపంచాయతీ నుంచి ఇచ్చిన ఇళ్ల లెక్కప్రకారం రూ.18 వేలు అయితే తాను తీసుకున్న లెక్క ప్రకారం దాదాపు రూ.40 వేల వరకు వసూలు చేశారు.
మొగులయ్య పంచాయతీ కార్యదర్శిగా వచ్చినప్పటి నుంచి చాలామంది దగ్గర వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. అదేవిధంగా అభివృద్ధి పనుల పేరిట వచ్చే బిల్లుల చెల్లింపుల విషయంలోనూ చేయి చాచి నట్లు పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. చీలాపూర్ గ్రామానికి చెందిన ఉమ్మెంతల్ దయాకర్ వద్ద ఇంటి అనుమతి కోసం వెళ్తే రూ.40వేలు అవుతుందని చెప్పారని బతిమాలితే రూ.28వేలకు తగ్గా రని తెలిపాడు. అదేగ్రామానికి చెందిన వడ్డె రామస్వామి గతంలో అండర్ డ్రైనేజీ పనులు చేయించగా బిల్లుల విషయంలో సతాయించాడని వాపోయాడు. వచ్చిన బిల్లులో తనకు కొంత ముట్టజెప్పాలని కార్య దర్శి మొగులయ్య డిమాండ్ చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. చీలాపూర్ గ్రామస్తుడు గోవర్దన్ ఇంటి అనుమతి కోరగా మొగులయ్య రూ.35 వేలు డిమాండ్ చేసినట్లు తెలిపాడు. తనవద్దే కాకుండా చాలా మంది వద్ద డబ్బులు వసూలు చేసినట్లు చెప్పాడు. అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్న కార్య దర్శి మొగులయ్యపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.


