రాజకీయ ఘర్షణలతో మూడు రోజులుగా అట్టుడుకుతున్న పల్నాడు జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. పోలీసు ఉన్నతాధికారులు శాంతిభద్రతలను అదుపులోకి తెస్తున్నారు. శాంతిభద్రతలు అదుపులోకి రావడంతో పట్టణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల చిరు వ్యాపారాలు దుకాణాలను తెరిచారు.
అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేవరకూ 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ప్రస్తుతం పల్నాడు జిల్లా ప్రధాన పట్టణాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మాచర్ల పట్టణంలో పోలీసులు 1500 మంది బలగాలను మోహరింపజేసి, 144 సెక్షన్ అమలు చేస్తు న్నారు. పట్టణంలోకి ప్రవేశించే మార్గాల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కొత్త వ్యక్తులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. గ్రామాల్లోనూ పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. కారంపూడి, గురజాల, పిడుగురాళ్ల, దాచేపల్లి పట్టణాల్లోనూ భారీగా పోలీసులు ఉన్నారు. నరసరావుపేట, మాచర్లలో జరిగిన అల్లర్ల ఘటనల్లో కేసులు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. 144 సెక్షన్ అమలు చేశామని, ఎవరూ గుంపులుగా రోడ్లపై తిరగవద్దని హెచ్చరించారు. నాయకులు ఇష్టారాజ్యంగా బయట తిరుగుతూ.. తమ అనుచరులను రెచ్చగొట్టడం వల్లే అల్లర్లు చెలరేగుతున్నాయని గుర్తించిన పోలీసులు వారిని గృహ నిర్బంధం చేశారు.


