కట్టడాలు ఒవైసీదా, మల్లారెడ్డిదా అనేది చూడమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచిస్తామని అన్నారాయన. చెరువులను ఆక్రమించి కళాశాల భవనాలు కట్టడం వాళ్ల పొరపాటు అయి ఉండొచ్చు… కానీ FTL అనేది ముఖ్యమైన అంశం. దానికంటే విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని రంగనాథ్ అన్నారు. ఒవైసీ, మల్లారెడ్డి లాంటి వ్యక్తుల కళాశాలలకు సమయం ఇస్తామని చెప్పారు. పార్టీలకు అతీతంగా తమ చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ చదరంగంలో హైడ్రా పావుగా మారదలుచుకోలేదని అన్నారు.
ధర్మసత్రమైనా FTL పరిధిలో ఉంటే కూల్చేస్తామని రంగనాథ్ చెప్పారు. హైడ్రా నోటీసులు ఇవ్వదు.. కూల్చడమే అని స్పష్టం చేశారు. నగరంలోని పలు చెరువులు, పార్కుల ఆక్రమణలపై పలువురు బీజేపీ కార్పొరేటర్లు హైడ్రా కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటల ఆక్రమణలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదు దారులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు క్యూ కడుతున్నారు. దీంతో హైడ్రా కార్యాలయానికి రోజు రోజుకీ తాకిడి పెరుగుతోంది. మొదట్లో పదుల సంఖ్యలో వచ్చిన ఫిర్యాదులు.. హైడ్రా కఠిన చర్యలతో వందల్లోకి చేరాయి. వాటన్నింటినీ స్వీకరిస్తున్న కార్యాలయ సిబ్బంది అందులోని వివరాలను నమోదు చేసుకుంటూ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. మరోవైపు ఫిర్యాదుదారుల తాకిడి పెరగడంతో హైడ్రా కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు పెంచారు.