సొంత ఊరిలో ఓట్లేసిన ప్రజలు సాయంత్రానికి తిరిగి తెలంగాణ బాటపట్టారు. కార్లు, బస్సులు.. ఏ వాహనం దొరికితే అది పట్టుకొని హైదరాబాద్‌కు బయల్దేరారు. హైదరాబాద్ వైపు వచ్చే రహదారుల్లో నిన్న సాయంత్రం 5 గంటల దాటాక ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్‌గేట్ వద్ద సాధార ణంగా 24 గంటల వ్యవధిలో 20 వేలకు పైగా వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్తుంటాయి. నిన్న మాత్రం సాయంత్రం 6.30 గంటలకు వీటి సంఖ్య 35 వేలకు పైగా చేరింది. రద్దీ అంతకంతకు పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుమారు 6 లక్షల మంది తెలంగాణ నుంచి వచ్చినట్లు అంచనా.
సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకునేందుకు వివిధ దేశాల నుంచీ ప్రవాసాంధ్రులు పెద్దఎత్తున తరలివచ్చారు. కొందరు 3, 4 నెలలుగా ప్రచారంలోనూ పాల్గొన్నారు. నిన్న ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి ఓటేశారు. అధిక శాతం ప్రవాసాంధ్రులు సాయంత్రానికే తిరుగు ప్రయాణమ య్యారు.