26.7 C
Hyderabad
Sunday, June 16, 2024
spot_img

కార్పొరేట్ల దన్నుతో ఆపరేషన్ సమాధాన్

అపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ ప్రహార్. ఇలా చెప్పుకుంటూ పోతే ఆపరేషన్ కాగర్ వరకు ఒకదాని వెంట మరోటిగా ఎన్నో ప్రణాళికలు మరెన్నో వ్యూహాలు.! దండకారణ్యంలో మావోలను మట్టుబెట్టేందుకు ఎన్నో స్కెచ్‌లు వేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనే విమర్శలున్నాయి. అయితే పైకి ఇదే కన్పిస్తున్నా, ప్రభుత్వాల వెనుక కార్పొరేట్లు కూడా ఉండి ఈ తతంగాన్నంతా నడిపిస్తున్నాయన్నది మావో లు, ప్రజా సంఘాల ప్రధాన ఆరోపణ. ఒకరకంగా ఆదివాసీలను సైతం అంతం చేసే ఓ పెద్ద పన్నాగమే నడుస్తోందన్న విమర్శలున్నాయి ? ఇందులో నిజమెంత ?

మావోయిస్టులు దేశ అభివృద్ధికి అతిపెద్ద శతృవులు అంటూ మన పాలకులు అభివర్ణిస్తున్నారు. ఈ వ్యాఖ్యలలోనే ఎంతో మర్మం దాగుంది. ఆ లెక్కన చూస్తే, అభివృద్ధికి అడ్డుగా ఉన్న వారిని అక్కడి నుంచి తప్పించడమే లక్ష్యంగా వాళ్ల ఏరివేతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సరికొత్త పంథాను అవలంభిస్తున్నాయి. మావోయిస్టులతో చర్చల వ్యవహారం మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హయాం నుంచీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విన్పిస్తోంది. అయితే నక్సల్స్‌తో చర్చలు జరుపుతామంటూ చెప్పుకొచ్చిన నాటి కాంగ్రెస్ నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి. అన్నట్లుగానే 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టాక వారిని చర్చలకు ఆహ్వానించారు. ఈ క్రమంలోనే నాటి నక్సల్స్ అగ్రనేతలు ఆర్కే సహా పలువురు శాంతి చర్చల కు హాజరై తమ గళాన్ని విన్పించారు. వివిధ రకాల డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. అయితే నాటి చర్చల చివరకు విఫలమయ్యాయి. అప్పటి నుంచి రాష్ట్రంలో అన్నల వేట మరింతగా పెరిగింది. ఇలాంటి సమయంలోనే నాడు డీజీపీగా ఉన్న స్వరణ్ జిత్ సేన్ చేసిన కామెంట్లు తీవ్ర వివాదం సృష్టించాయి. కూంబింగ్ గురించి మీడియా అడిగితే కోంబింగ్ అంటూ ఆయన చెప్పడం అప్పట్లో విమర్శలకు దారి తీసింది.

కేంద్రంలో నాటి హోంమంత్రి చిదంబరం హయాంలో ఆపరేషన్ గ్రీన్ హంట్ మొదలు పెట్టారు. అప్పుడు యూపీఏ ప్రభుత్వ హయాంలో మొదలైన నక్సల్స్ ఏరివేత కార్యక్రమం ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ పాలనలో పీక్స్‌కు చేరిందనే విమర్శలు ప్రజా సంఘాల నుంచి పెద్ద ఎత్తున విన్పిస్తున్నాయి. స్వామి అగ్నివేష్ లాంటి వారు మధ్యవర్తిత్వం వహించడంతో చర్చలు ఫలిస్తాయని అంతా అనుకున్నా.. వాటి నుంచి గుట్టు మట్లు సేకరించి చివరకు అడవిలో అన్నలను అడవిలోనే హతమార్చే వరకు పరిస్థితి తీసుకొచ్చారు. ప్రజాసంఘాల నేతలు పలువుర్ని జైలు పాలు చేసి తీవ్ర నిర్బంధాలకు గురిచేశారు. చివరకు సాయిబాబా లాంటి వారు కోర్టుల సాయంతో బయటకు రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయం టేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఉద్యమ నాయకులు, ప్రజా సంఘాల నేతలు. మరోవైపు మావోయిస్టుల ఏరివేత కోసం ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ హాకా, ఆపరేషన్ విజయ్, ఆపరేషన్ సమాధాన్ అంటూ వరుసగా పలు ప్రాజెక్టులు చేపట్టింది కేంద్రం. ఈ సమాధాన్‌తోనే దేశంలో మావోయిస్టు లను పూర్తిగా నిర్మూలించాలని భావించారు. సమాధాన్ అనే ఆంగ్లపదంలో ఒక్కో అక్షరానికి ఒక్కో అర్థం వచ్చేలా పేరు పెట్టారు. ఎస్ అంటే స్మార్ట్ నాయకత్వం, ఎ అంటే దూకుడు వ్యూహం, ఎం అంటే ప్రేరణ ఇంకా శిక్షణ, ఎ అంటే యాక్షన్ ఇంటెలిజెన్స్, డీ అంటే డ్యాష్ బోర్డ్ ఆధారిత రిజల్ట్ ఏరియా, హెచ్ అంటే హార్నెసింగ్ టెక్నాలజీ, ఏ అంటే యాక్షన్ ప్లాన్, ఎన్ అంటే నో యాక్సెస్ అని అర్థం. ఈ ప్లాన్ ప్రకారమే మధ్యప్రదేశ్ నుంచి ఒడిషా వరకు విస్తరించి ఉన్న దండకారణ్యం ప్రాంతంలో ఎక్కడికక్కడ.. ఐదు కిలోమీటర్లకు ఒకటి చొప్పున క్యాంపులు ఏర్పాటు చేసుకునేందుకు భద్రతాదళాలకు అవసరమైన సాయం అందిస్తోంది కేంద్రం. భారీగా ఆహార పదార్థాలతోపాటు ఆయుధ సామాగ్రి, అధునాతన పరికరాలు అందిస్తూ అడవిలో అన్నల్ని మట్టుబెట్టే కార్యక్రమాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తోంది.

ఎక్కడికక్కడ క్యాంపులు ఏర్పాటు చేసుకున్న బలగాలు. గుంపులు గుంపులుగా ఏర్పడి కొంచెం కొంచెంగా ముందుకు కదులుతున్నాయి. దండకారణ్యంలో మావోలకు మరింత పట్టున్న అబూజ్ మడ్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇటీవలె జరిగిన ఘటనలో 29 మంది మావోలు ప్రాణాలు కోల్పోయింది కూడా ఈ ప్రాంతంలోనే అయితే ప్రభుత్వ బలగాల అంచనా ప్రకారమే అబూజ్‌మడ్‌పై పట్టు సాధించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదన్న వాదన విన్పిస్తోంది. ఇక్కడ ఉండే చిన్న చిన్న గిరిజన గ్రామాలు, కొద్ది మంది ప్రజలు మావోయిస్టుల విషయంలో సాను భూతి పరులుగా ఉన్నారు. దీంతో.. వారి సాయంతో ఎక్కడికక్కడ మందుపాతరలు ఏర్పాటు చేసి, గెరిల్లా యుద్ధాలను మావోలు చేసే అవకాశం ఉందని అనుమానిస్తున్నాయి భద్రతా దళాలు. అయితే ఆపరేషన్ సమాధాన్‌తో కూడా తమ లక్ష్యం నెరవేరకపోవడంతో కేంద్రం ఆపరేషన్ కాగర్ చేపట్టింది. దీని ప్రధాన లక్ష్యం అబూజ్ మడ్‌ సహా దండ కారణ్యం లోని మొత్తం మావోలను ఏరివేయడం. ఇందులో భాగంగా అబూజ్ మడ్ ప్రాంతంలో ఇప్పటికే సుమారు లక్ష మంది వరకు భద్రతా దళాలను బరిలో దింపింది. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో వేసవి కూడా కలిసి రావడంతో తమ వేట మరింత ఎక్కువ చేసింది. ఓ అంచనా ప్రకారం ఈ నాలుగైదు దశాబ్దాల్లో 15 వేల మంది వరకు అన్నలు హతమైనట్లు తెలుస్తోంది.

ఇదంతా కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నవి కాదని, వెనకుండి కార్పొరేట్లు నడిపిస్తున్న కుట్రలనే ఆరోపణలు న్నాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే సహాజ సంపదలైన బాక్సైట్, బొగ్గు సహా ఇతర ఖనిజ సంపద కోసం, వాటిపై పెత్తనం చేజిక్కించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇటీవలి కాలంలో మావోయిస్టుల వేట మరింత తీవ్రమైందన్న ఆరోపణలు ప్రధానంగా ఉద్యమనేతలు, ప్రజాసంఘాల, ప్రజాస్వామ్యవాదుల నుంచి విన్పిస్తున్నాయి.

Latest Articles

నవ్విస్తూ, భయపెట్టిన OMG (ఓ మంచి ఘోస్ట్) ట్రైలర్

వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటించిన హారర్, కామెడీ ఎంటర్‌టైనర్ OMG (ఓ మంచి ఘోస్ట్). మార్క్ సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్ మీద డా.అబినికా ఇనాబతుని నిర్మించిన ఈ చిత్రానికి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్