లగచర్లలో మరోసారి టెన్షన్ టెన్షన్. పారిశ్రామికవాడ భూసేకరణకు సర్వే అంటూ వచ్చిన అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు గిరిజనులు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు… ప్రజలను అడ్డుకోవడంతో పరిస్థితి తోపులాటకు దారితీసింది. ఉద్రిక్తంగా మారింది. ఫ్లకార్డులు పట్టుకొని ఎక్కడికక్కడ నిరసన తెలిపారు గిరిజనులు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదంటూ తేల్చిచెబుతున్నారు. మా అనుమతి లేకుండా పొలాల్లో ఎలా సర్వే చేస్తారు అంటూ ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు లగచర్ల రైతులు. దీంతో.. మరోసారి దుద్యాల మండలం లగచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇటీవలె లగచర్లలో చోటు చేసుకున్న పరిస్థితులను మర్చిపోకముందే మరోసారి టెన్షన్ టెన్షన్ అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. పారిశ్రామికవాడ కోసం భూసేకరణ సర్వే చేసేందుకు లగచర్ల వచ్చారు సర్వే అధికారులు. రోటిబండ తండా వద్ద సర్వే చేసేందుకు ప్రయత్నించగా గిరిజనులు అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. భారీగా తరలి వచ్చిన పోలీసులు ప్రజలను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో.. గిరిజనులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. గిరిజనులు పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఫ్లకార్డులు ప్రదర్శించారు. తమ అనుమతి లేకుండా సర్వే ఎలా చేస్తారని ప్రశ్నించారు. అయినా సరే పోలీసు బందోబస్తు మధ్య అధికారులు సర్వే నిర్వహించారు. దీనిపై గిరిజన రైతులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచర్ల కుంట తండాలో ఫార్మాసిటీ కోసం దాదాపు 13 వందల ఎకరాలు భూసేకరణ చేయాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు మూడు నెలల క్రితమే ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లగా కలెక్టర్‌తోపాటు అధికారులపై గిరిజనులు, రైతులు దాడి చేశారు. అప్పట్లో జరిగిన ఈ దాడి రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టించింది.
ఈ కేసులో రైతులు జైలుకు వెళ్లడం అనంతరం బెయిల్‌పై విడుదల కావడం జరిగాయి. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగటంతో ఫార్మాసిటీ ఏర్పాటుపై వెనక్కు తగ్గింది రేవంత్ సర్కారు. అయితే.. అదే స్థానంలో పారిశ్రామికవాడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే భూసేకరణ కోసం సర్వే చేస్తున్నారు అధికారులు. ఇందులో భాగంగానే రోటిబండ తండాకు ఆఫీసర్లు రావడంతో గిరిజన రైతులు అడ్డుకున్నారు. ఉన్న కొద్ది వ్యవసాయ పొలాలను పరిశ్రమల కోసం లాక్కుంటే తాము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదని తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం నిర్బంధంగా వ్యవహరించడం సరికాదంటున్నారు గిరిజనులు. ఈ విషయంలో రేవంత్ సర్కారు పునరాలోచించాలని లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని తేల్చిచెబుతున్నారు లగచర్ల గిరిజన రైతులు.