సుంకాల విషయంలో భారత్‌కు మినహాయింపు లేదని మరోసారి స్పష్టం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. బిలియనీర్ ఎలాన్ మస్క్ తో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచ వాణిజ్యం , అమెరికా దాని భాగస్వాముల మధ్య పరస్పర పన్నుల విధింపుపై తన వైఖరిని పునరుద్ఘాటించారు.
“ఇక్కడ ఉన్నప్పుడు నేను ప్రధానమంత్రి (నరేంద్ర) మోదీకి చెప్పాను – ‘మనం ఏమి చేయబోతున్నామో అది: మీరు ఏమి వసూలు చేస్తారో, నేను అదే వసూలు చేస్తున్నాను'” అని అధ్యక్షుడు ట్రంప్ ప్రధానితో మాట్లాడిన సంభాషణను గుర్తుచేసుకుంటూ అన్నారు. “ఆయన (ప్రధాని మోదీ) ‘లేదు, లేదు, నాకు అది ఇష్టం లేదు’ అని అన్నారు. ‘లేదు, లేదు, మీరు ఏమి వసూలు చేసినా, నేను అదే వసూలు చేస్తాను.’ నేను ప్రతి దేశంతోనూ అలాగే చేస్తున్నాను.”
అమెరికా నుండి వచ్చే కొన్ని దిగుమతులపై, ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారతదేశం ఒకటి. ఇక్కడ విదేశీ కార్లపై సుంకాలు 100 శాతం వరకు ఉంటాయి. అధ్యక్షుడు ట్రంప్ పక్కన కూర్చున్న ఎలాన్ మస్క్ దీనిని ధృవీకరించారు. “ఇది 100 శాతం నిజం -ఇండియాలో ఆటో దిగుమతులపై 100 శాతం సుంకం” అని అన్నారు.
అధ్యక్షుడు ట్రంప్ మాట్లడుతూ.. ” ఇది చాలా చిన్నవి. వాటిని మించిన సుంకాలు విధిస్తుంది. ఇతరులు కూడా అంతే. నేను 25 శాతం సుంకాలు విధిస్తే.. అబ్బో అంత భయంకరంగానా అంటారు.” అని అన్నారు.
ఇటువంటి సుంకాల వల్ల అమెరికా కంపెనీలు భారతదేశంలో తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయకపోతే అక్కడ అమ్మకాలు చేయడం దాదాపు అసాధ్యమని అన్నారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టమని చెప్పారు.
భారత్ విధిస్తున్న పన్నుల మీద ట్రంప్ తప్పుపట్టడం ఇదేం తొలిసారి కాదు. తన తొలి విడత పాలన సమయంలో కూడ ఇండియన్ టారిఫ్ కింగ్ అని అనేవారు.
ప్రధాని మోదీ ఇటీవల వాషింగ్టన్‌లో పర్యటించిన సందర్భంగా.. భారత్-అమెరికా వాణిజ్యాన్ని 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. దీంతో పాటు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకొనేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు.