Revanth Reddy | కాంగ్రెస్ పార్టీలో ఎవరి దారి యమునా తీరాన అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది.ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నంత వాక్ స్వతంత్రం, ప్రజాస్వామ్యం మరే పార్టీలో ఉండదు ఈ దేశంలో. అందుకే ప్రతిపక్ష నాయకులు చేసినట్లుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. ఒకరికి పదవి వస్తే ఇంకొకరికి నచ్చదు. వారిని ఎలా ఆ పదవి నుంచి దించాలా అని పన్నాగాలు పన్నుతూ ఉంటారు. అందుకే అంటారు కాంగ్రెస్ నేతలకు బయట పార్టీలతో శత్రుత్వం అవసరం లేదని.. వారికి వారే శత్రువులని. తాజాగా ఇటువంటి ఘటనలే తరుచుగా జరుగుతున్నాయి హస్తం పార్టీలో. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి వచ్చిన దగ్గరి నుంచి ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం.
తాజాగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బలోపేతం దిశగా హాత్ సే హాత్ జోడో యాత్ర చేస్తున్నారు. తనదైన శైలిలో అధికార బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భూపాలపల్లిలో రేవంత్(Revanth Reddy) ప్రసంగిస్తుండగా టమాటాలు, కోడి గుడ్లతో ప్రత్యర్థి పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఓ పార్టీ అధ్యక్షుడిపై కోడిగుడ్లతో దాడి జరిగి 24గంటలు కావస్తున్నా సీనియర్ నాయకులు స్పందించలేదు. ఏ చిన్న విషయం చిక్కినా రేవంత్ ను విమర్శించడానికి ముందుండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వారు ఇంత పెద్ద దాడి జరిగినా స్పందించకపోవడంపై రేవంత్ క్యాడర్ అసహనం వ్యక్తంచేస్తోంది.
రేవంత్ కు పీసీసీ అధ్యక్ష పదవి రావడం కొంత మంది సీనియర్ నేతలకు ఇష్టం లేదని అందరికి తెలిసిన సంగతే. ఈ క్రమంలోనే తమ నాయకుడిపై దాడి జరిగితే స్పందించకుండా ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై ఎవరైనా విమర్శలు చేస్తే బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ఎదురుదాడి చేస్తారని.. అలాగే బండి సంజయ్ విషయంలో కూడా కమలం నేతలు విమర్శలను తిప్పికొడతారని పేర్కొన్నారు. కానీ రేవంత్ విషయంలో మాత్రం అలా జరగదు. ఎవరు ఏమన్నా, ఏం చేసినా పర్లేదు ఆయన మా నాయకుడే కాదన్నట్లు కొందరు సీనియర్లు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఏదో ఒకరిద్దరు నేతలు తప్పితే మిగిలిన నేతలు ఎవరు పార్టీని పట్టించుకోవడం లేదని రేవంత్ వర్గీయులు మండిపడుతున్నారు.