స్వతంత్ర వెబ్ డెస్క్: జమ్ము రీజియన్‌లో తిరుమల శ్రీవారి ఆలయం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ వెలుపల తితిదే నిర్మించిన వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఇది ఆరోది. 62 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ దేవాలయాన్ని రికార్డ్ సమయంలో పూర్తి చేసినట్లు దేవస్థానం వర్గాలు తెలిపాయి. శ్రీవారి ఆలయంతో జమ్ములో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందనుంది. తొలి రోజే స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆలయ మహా సంప్రోక్షణం ఘనంగా జరిగింది. జమ్ము లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా టీటీడీ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, జితేంద్ర సింగ్ తో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. కాగా, జమ్ములోని మాజిన్ గ్రామంలో స్వామి వారి ఆలయాన్ని టీటీడీ నిర్మించింది. 62 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణానికి 30 కోట్ల ఖర్చు అయింది. అందమైన శివాలిక్ అడవుల మధ్య శ్రీ వెంకటేశ్వర ఆలయం నిర్మించడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే జమ్మూ ప్రాంతంలో ఉన్న అతి పెద్ద దేవాలయాలలో ఇది ఒకటి.జమ్మూలోని ఈ గుడి ఏపీలో వెలుపల నిర్మించిన ఆరో శ్రీ వెంకటేశ్వర ఆలయం. మిగతా ఐదు ఆలయాలు తిరుమల తిరుపతి దేవస్థానం హైదరాబాద్, చెన్నై, కన్యాకుమారి, ఢిల్లీ, భువనేశ్వర్ లలో ఉన్నాయి. ఇక రాయ్ పూర్, అహ్మదాబాద్ లలో కూడా త్వరలోనే కొత్త ఆలయాలు నిర్మించడానికి టీటీడీ సన్నాహాలు చేస్తోంది. అయితే జమ్ములో భక్తులకు ఉచిత దర్శనం అందించనున్నారు. తిరుమలలో అనుసరిస్తున్న విధానం, ఆచారాన్ని ఇక్కడ అనుసరిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇక్కడ కూడా ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయ సముదాయంతో పాటు ఉపాలయాలు, కిచెన్ ఏరియా, అన్నప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది.