స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. శాసనసభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ భవన్ లో కేసీఆర్(KCR) అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ సమావేశంలో అక్టోబర్ 16 న వరంగల్ లో బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో (Election Manifesto) విడుదల చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఆ రోజు వరంగల్ లో భారీ ర్యాలీ ఉంటుందని కేసీఆర్ తెలిపారు. ఈ రోజు (ఆగస్టు 21)న తెలంగాణ భవన్ లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేశారు. తమ పార్టీ అజెండా ప్రగతి అని తెలిపారు. ఈ సారి మ్యానిఫెస్టోలో చాలా సంక్షేమ పథకాలు ఉంటాయన్నారు.
అక్టోబర్ 16వ తేదీన 10 లక్షల మందితో వరంగల్(Warangal) జిల్లా భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సభ ఏర్పాట్లపై ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నేతలకు సీఎం కేసీఆర్ సమాచారం ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందే ఇప్పటికే బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ ప్రచార కార్యక్రమాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తూ… అక్టోబర్ 16వ తేదీన భారీ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు. మలిదశ ఉద్యమం ప్రారంభం నుంచి కేసీఆర్ కు వరంగల్ బాగా అచ్చొచ్చింది. అందుకే ఇక్కడి నుంచే వచ్చే ఎన్నికల కోసం ప్రచార శంఖారావం పూరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.