రాజకీయాల్లో తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్న కోలగట్ల వీరభద్ర స్వామి ఎక్కడ? అధికారం కోల్పోగానే ఆయన జనాలకు దూరమయ్యారా? ఆయన మౌనంపై వైసీపీ కేడర్ కూడా మండిపడుతోందా? ఇప్పుడు విజయనగరం రాజకీయాల్లో ఇదే టాక్ నడుస్తుంది. వైసీపీ హయాంలో ఒక వెలుగు వెలిగిన కోలగట్ల వీరభద్రస్వామి.. ఉమ్మడి విజయనగరం జిల్లాలో తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పరుచుకున్నారు. కౌన్సిలర్ స్థాయి నుంచి డిప్యూటీ స్పీకర్ వరకు ఎదిగిన కోలగట్ల.. గత ప్రభుత్వ హయాంలో హడావిడి చేశారు. ఎక్కడకు వెళ్లినా ప్రోటోకాల్ ప్రకారం తనకు మర్యాద దక్కాలని యంత్రాంగాన్ని పరుగులు పెట్టించేవారు. మంత్రులతో సమానంగా తనకూ మర్యాదలు ఉండాలని చెప్పేవారు. ఇలా అధికారంలో ఉన్నప్పుడు హల్ చేసిన నాయకుడు ఇప్పుడు లైమ్ లైట్‌లో లేకుండా పోయారు.
1983లో కాంగ్రెస్ పార్టీ నుంచి పొలిటికల్ అరంగేట్రం చేసిన కోలగట్ల.. మొదట విజయనగరం మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత విజయనగరం అర్బన్ కోఆపరేటీవ్ బ్యాంకు చైర్మన్‌గా పనిచేసి.. 1989లో తొలి సారి విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. విజయనగరం అంటే గజపతి వంశానికి పెట్టని కోట. అలాంటి చోట అశోక్ గజపతి రాజుపై అలుపెరగని పోరాటం చేసి.. చివరకు 2004లో తొలి సారి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2009లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి మరో సారి ఓటమి పాలయ్యారు. 2019లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు కోలగట్ల వీరభద్ర స్వామి.
రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కోలగట్ల దశ తిరిగింది. కోలగట్లను డిప్యూటీ స్పీకర్‌ను చేయడమే కాకుండా.. ప్రత్యేక జీవో తెచ్చి ఆయనకు మంత్రులతో సమానంగా ప్రోటోకాల్ హోదా కల్పించారు. మరోవైపు కోలగట్ల వీరభద్రస్వామి కూతురును విజయనగరం డిప్యూటీ మేయర్‌గా చేశారు. దీంతో విజయనగరంలో కోలగట్ల చెప్పిందే వేదంగా మారింది. తన కూతురును డమ్మీని చేసి.. అల్లుడితోనే విజయనగరం కార్పొరేషన్ కథంతా నడిపించారనే టాక్ ఉంది. అప్పట్లో తనకు ఉన్న అధికారాలు ఉపయోగించి భారీగా డబ్బులు వెనకేసుకున్నారని సొంత పార్టీ క్యాడరే ఆరోపణలు చేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు కోట్లకు పడగలెత్తిన నాయకుడు ఇప్పుడు పార్టీ కష్టాల్లో ఉండగా కనీసం బయటకు కూడా రావడం లేదని కేడర్ మండిపడుతున్నారట.
కోలగట్ల తీరుతో వైసీపీ కేడర్ ఇబ్బందులు పడుతుందట. విజయనగరంలో పార్టీ కార్యకర్తలను కలిసి వారికి భరోసా కల్పించాలసిన కోలగట్ల.. పార్టీకి పూర్తిగా దూరమయ్యారని కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అధికారం కోల్పోయి 8 నెలలు గడిచిపోయినా.. ఇంత వరకు పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించలేదట. అధికారంలో ఉన్నప్పుడు తనకు పదవులు ముఖ్యం కాదని.. ఓడినా, గెలిచినా మీతోనే ఉంటానని హామీ ఇచ్చిన కోలగట్ల.. ఇప్పుడు వారి వైపు కన్నెత్తి చూడటం లేదట. కోలగట్ల తీరు చూస్తుంటే క్రమంగా వైసీపీకి దూరమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
వాస్తవానికి కోలగట్లకు కూడా భవిష్యత్‌లో ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి లేదని తెలిసింది. ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుంటారనే టాక్ వినిపిస్తుంది. వైఎస్ జగన్ కూడా ఆయనకు టికెట్ ఇవ్వబోననే సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. మరోవైపు కోలగట్ల జనసేనలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతుంది. కోలగట్ల యాక్టీవ్‌గా లేరు కాబట్టి విజయనగరానికి కొత్త నాయకుడిని ఇంచార్జిగా వేయాలని కేడర్ కోరుతోందట. వైఎస్ జగన్ కూడా విజయనగరంలో కొత్త నాయకుడిని తయారు చేయాలని భావిస్తున్నారట. గజపతి వంశాన్ని ఢీకొట్టే బలమైన నాయకుడి కోసం ఇప్పటికే అన్వేషణ మొదలైందనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు కోలగట్ల కూడా ఈ విషయం తెలిసినా పూర్తి మౌనాన్ని పాటిస్తున్నారు. మొత్తానికి విజయనగరంలో వైసీపీకి కొత్త మొఖాన్ని వెతికే పనిలో జగన్ ఉన్నారు. మరోవైపు కోలగట్ల జనసేనలోకి వెళ్తారా లేదంటే పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుంటారా అనే విషయం ఆసక్తికరంగా మారింది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.