ఏపీలో ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. మే13న ఎన్నికల కురుక్షేత్రం జరగనుంది. ఇప్పటికే పార్టీలన్నీ ప్రజల బాట పట్టాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. పోలింగ్‌కు టైం దగ్గర పడుతుండడంతో అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకూ ఎవరికి వారుగా ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు..ఎన్నికలు దగ్గరపడు తుండడం తో వ్యూహం మార్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రచారం నిర్వహించనున్నారు.
టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన తర్వాత..గత నెల 17న చిలకలూరిపేటలో తొలి బహిరంగ సభను నిర్వ హించారు. ఈ సభకు మూడు పార్టీల అగ్రనేతలు ప్రధాని మోదీ, చంద్రబాబ, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి బహిరంగసభలో పాల్గొనలేదు. చంద్రబాబు ప్రజాగళం పేరుతో 25 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేశారు. అటు వారాహి విజయయాత్రతో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుం డటంతో కలిసి ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఈ నెల 10, 11 తేదీల్లో జరిగే మూడో విడత ప్రజాగళంలో చంద్రబాబు- పవన్ కలిసి పాల్గొననున్నారు. ఈ నెల 10న తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. 11న పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రచారం చేస్తారు. మరోవైపు ఏప్రిల్ 14వ తేదీన పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించనున్నారు. ఇప్పటివరకు విడివిడిగా ప్రచారం చేసిన ఇద్దరు అగ్రనేతలు..ఇప్పుడు ఉమ్మడిగా ప్రచార పర్వంలోకి దిగడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ వేడెక్కనుంది. అంతేకాకుండా చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారంతో రెండు పార్టీల శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపించ నుంది.


