విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అడ్రసే గల్లంతైంది. ఉమ్మడి రాష్ట్రం విభజనకు కాంగ్రెస్ అధిష్టానం అంగీకారం చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. విభజన తరువాత రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. గెలుపు సంగతి తరువాతి విషయం. కనీసం కాంగ్రెస్ క్యాండిడేట్లకు డిపాజిట్లు కూడా దక్కలేదు. అసలు కాంగ్రెస్ జెండాలు మోసే కార్యకర్తలు కూడా కరువయ్యారు. ఉమ్మడి రాష్ట్రం విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్‌ను మరచిపోయారు.
ఉమ్మడి రాష్ట్రం విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి గిడుగు రుద్రరాజు చాలాకాలం పాటు అధ్యక్షుడిగా పనిచేశారు. పీసీసీ ప్రెసిడెంట్ హోదాలో గిడుగు రుద్రరాజు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గర కాలేకపోయింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయాలు శరవేగంగా మారాయి. దేశవ్యాప్తంగా బలహీనంగానే ఉన్నా, దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది.
దక్షిణాదిన ఐదు రాష్ట్రాలుంటే, రెండు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణలో విజయం ఇచ్చిన స్ఫూర్తితో మొత్తంగా దక్షిణాదిన బలపడాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. అప్పటికి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే ప్రధాన రాజకీయ పార్టీలుగా ఉన్నాయి. అప్పటివరకు కాంగ్రెస్‌కు ఓటు బ్యాంక్‌గా ఉన్నా సామాజిక వర్గాలన్నీ దాదాపుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శిబిరానికి తరలిపో యాయి. తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించే కాంగ్రెస్ వాదులందరూ జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరిపోయారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్వరూపమే మారిపోయింది. ఇటు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అటు జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన పక్షాలుగా అవతరించాయి. మరోవైపు దక్షిణాదిన మరింతగా బలపడాలంటే ఆంధ్రప్రదేశ్‌లో కూడా సత్తా చాటాలని కాంగ్రెస్ అధిష్టానం భావించింది. ఇందులో భాగంగా సామాన్య ప్రజల్లో గుర్తింపు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కట్టబెట్టింది అధిష్టానం.
ఏపీసీసీ అధ్యక్షురాలిగా ఈ ఏడాది జనవరిలో షర్మిల పగ్గాలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలతో పాటు సినీ నటుడు పవన్ కల్యాణ్ నాయకత్వంలో జనసేన కూడా ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి తొలిసారి ఎంట్రీ ఇచ్చారు. ప్రధానంగా ఒక అగ్రకులం అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డికి అండగా నిలిచిన బడుగు, బలహీనవర్గాలను టార్గెట్‌గా చేసుకుని షర్మిల ప్రచారం ప్రారంభించారు. సహజంగా రాజశేఖర రెడ్డి బిడ్డగా షర్మిలకు సామాన్య ప్రజల్లో ఇమేజ్ ఉంది. అంతేకాదు చెల్లెలై కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై నిప్పులు చెరుగుతూ షర్మిల చేసిన ప్రసంగాలు, వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ప్రధానంగా చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య ఎపిసోడ్‌ను ప్రధానాంశం చేసుకుని వైఎస్ షర్మిల ప్రచారం చేస్తున్నారు. దీంతో కడప జిల్లావరకు షర్మిల ప్రభావం కొంతమేర ఉంటుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రెండు పక్షాల మధ్య హోరాహోరీ ఎన్నికల సమరం నడుస్తోంది. ఒకవైపు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ మరోవైపు బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఒక జట్టుగా ఎన్నికల బరిలో నిలిచాయి. కాగా కాంగ్రెస్ పార్టీ ఒంటరిపోరు చేస్తోంది. దీంతో జగన్మోహన్ రెడ్డి సర్కార్ వ్యతిరేక ఓటు టీడీపీ నాయకత్వంలోని కూటమి, కాంగ్రెస్ పార్టీ మధ్య చీలిపోతుందని రాజకీయ పండితులు లెక్కలు వేస్తున్నారు. కాంగ్రెస్ బరిలో ఉండటం వల్ల అంతిమంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకే మేలు జరుగుతుందని రాజకీయ పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఆటలో అరటిపండే. అసెంబ్లీ అలాగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు .


