ప్రకృతి పర్యాటకం ఇటీవల తెరపైకి వచ్చిన టూరిజం ఇది. ప్రకృతిలోని అందాలను, పచ్చదనాన్ని చూసి ఆనందిం చడమే ప్రకృతి పర్యాటకం. దీనినే నేచర్ టూరిజం అని కూడా అంటారు. స్థూలంగా చెప్పాలం టే ప్రకృతి ఆధారిత పర్యాటకమే నేచర్ టూరిజం. ప్రకృతి పర్యాటకాన్నే వైల్డ్ లైఫ్ టూరిజం అలాగే అడ్వెంచరస్ టూరిజం అని కూడా అంటారు. ప్రకృతి సోయగాలను ఆస్వాదించాలంటే అడవుల్లోకి వెళ్లాల్సిందే. నగరాలను వదలిపెట్టి, వన్య ప్రాణులు సంచరిచే అడవుల్లోకి వెళ్లడం అంటే సాహసంతో కూడుకున్న పనే. అందుకే అడ్వెంచరస్ టూరిజం అనే పేరు వచ్చింది.
రొటీన్‌గా సాగే దైనందిన జీవితంతో చాలామంది విసుగు చెందుతారు. ఈ నేపథ్యంలో మనం నివసిస్తున్న ప్రపంచానికి దూరంగా కాసేపు ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకుంటారు. దీనికి నేచర్ టూరిజమే దారి చూపుతుంది. అంటే మనిసి తన సహజ ప్రపంచాన్ని అన్వేషించడానికి బయలుదేరాలి. అదే ప్రకృతి ఆధారిత పర్యాటకం. అసలు ప్రకృతి ఆధారిత పర్యాటకం అంటే ఏమిటి? అనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. అడవులు, కొండకోనలు, నదులు, పర్వతాలు, లోయలు, గలగలా పారే సెలయేళ్లు ఇవన్నీ ప్రకృతి ఆధారిత పర్యాటక గొడుగు కిందకు వస్తాయి. ప్రకృతిలో ఉండి, మనకు తెలియని వాటిని అన్వేషించాలనే కోరిక ఈ రోజుల్లో చాలా మందికి ఉంటుంది. కొద్ది రోజులు జనారణ్యాలకు దూరంగా ఉండాలని నగరవాసులు అనుకోవడం సహజం. ఇలాంటి వారికి దారి చూపించేదే నేచర్ టూరిజం. ప్రకృతిని పరిరక్షించాలనే ఆశయం ఇక్కడ పెద్ద పాత్ర పోషిస్తుంది. ప్రకృతి పర్యాటకంలో అంతర్లీనంగా పర్యావరణ అంశాలు మిళితమై ఉంటాయి.పర్యావరణ సమస్యల పట్ల ప్రజలను చైతన్యవంతులను చేయడం, వారికి అవగాహన కల్పించడం కూడా నేచర్ టూరిజంలో భాగంగా మారిపోయాయి. ఇటీవలి కాలంలో ప్రకృతి పర్యాటకం జోరందుకుంది. పర్యాటక పరిశ్రమలో నేచర్ టూరిజం ఒక ముఖ్యమైన భాగంగా మారింది. మొత్తం టూరిజంలో ప్రకృతి పర్యాటక రంగం ఏడు శాతం వాటాన్ని కలిగి ఉంటుంది. ప్రకృతి పర్యాటకంలో ముఖ్యమైన అంశం విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడం. మనదేశంతో పోలిస్తే విదేశాల్లో నేచర్ టూరిజం ఎక్కువగా కనిపిస్తుంది. ఆస్ట్రేలియా, యూరోప్ తో పాటు కొన్ని ఆఫ్రికా దేశాలు నేచర్ టూరిజంలో ముందు వరుసలో ఉన్నాయి. ఆస్ట్రేలియాలో ప్రకృతి పర్యాటక రంగంలో 62 శాతం మంది విదేశీయులు ఉంటారు. దేశీయ పర్యాటకులు కేవలం 16 శాతం మంది మాత్రమే ఉంటారు.
మనదేశంలో నేచర్ టూరిజంలో పొరుగున ఉన్న కర్ణాటక బాగా అభివృద్ది చెందింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ నేచర్ టూరిజాన్ని డెవలప్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున కసరత్తు మొదలెట్టింది. ఫలితంగా ప్రకృతి పర్యాటక విధానం రూపకల్పన ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 24 శాతం అటవీ ప్రాంతాలే. హైదరాబాద్ మహా నగర అభివృద్ధి సంస్థ పరిధిలోనూ లక్ష పైచిలుకు ఎకరాల్లో అటవీ భూములున్నాయి. తెలంగాణలో దట్టమైన అడవులు, అందులో వన్యప్రాణులు, జలపాతాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేకించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గురించి ప్రస్తావించుకోవాలి. ఉమ్మడి ఆదిలాబాద్‌ను జిల్లాను అడవుల జిల్లా అని పిలుస్తారు. అయితే నేచర్ టూరిజంలో భాగంగా అడవులకు వచ్చే పర్యాటకులకు మెరుగైన వసతి సౌకర్యాలు లేవు. పర్యాటకులకు వసతి సౌకర్యాలు మెరుగుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాగా ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతం బాగా ఫేమస్. కుంటాల జలపాతం తెలంగాణ లోనే అతి ఎత్తయిన జలపాతం. దట్టమైన అడవులలో, సహ్యాద్రి పర్వత శ్రేణిలో గోదావరికి ఉపనది అయిన కడెం నదిపై ఈ జలపాతం ఉంది. నేరడిగొండ మండలం కుంటాల గ్రామ సమీపంలో కుంటాల జలపాతం ఉంది. జలపాతానికి కుంటాల పేరు దుష్యంతుడి భార్య శకుంతల నుంచి వచ్చిందన్నది స్థానిక ప్రజల నమ్మకం. ఈ జలపాతం, పరిసరాల దృశ్యం చూసి శకుంతల మైమరిచిపోయి, తరుచుగా ఈ జలపాతంలో స్నానం చేసేదని ఇక్కడి ప్రజలు నమ్ముతారు.కుంటాలలో 45 మీటర్ల ఎత్తు నుంచి జలజల పారే నీళ్ళు, ఆ చప్పుడు పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. నేచర్ టూరిజా న్ని అభివృద్ధి చేయాలంటే ప్రధానంగా బయటి నుంచి వలస వచ్చే పక్షులు సంచరించే ప్రాంతాలు, జీవ వైవిధ్యం ఉన్న ప్రదేశాలకు ప్రాధాన్య ఇవ్వవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పై అటవీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా రానున్న రోజుల్లో నేచర్ టూరిజం మరింతగా అభివృద్ది చెందే అవకాశాలున్నాయి.