ఏపీ నుంచి మరొకరికి కేంద్రమంత్రి పదవి దక్కనుంది. బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస వర్మను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకోనున్నారు. ఈ మేరకు పీఎంవో నుంచి ఆయనకు సమాచారం అందింది. ఇప్పటికే ఏపీ నుంచి టీడీపీ ఎంపీలు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్ర శేఖర్‌కు కేంద్ర మంత్రివర్గంలో బెర్తులు ఖరారు అయ్యాయి. తాజాగా భూపతిరాజుకి బీజేపీ కోటలో చాన్స్ దక్కింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలపై 2.76లక్షల ఓట్ల మెజార్టీతో శ్రీనివాస వర్మ ఘన విజయం సాధించారు. శ్రీనివాస వర్మ 1988లో బీజేపీ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించారు. దశాబ్దాలుగా బీజేపీకి సేవలందిస్తున్నారు. 1992-95లో జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 2014లో భీమవరం పురపాలక వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గానూ సేవలందిం చారు. తాజాగా నరసాపురం నుంచి ఎంపీగా ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో బెర్తు ఖరారైంది.