టీడీపీ యువనేత నారా లోకేశ్(Nara Lokesh) పాదయాత్ర శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో కొనసాగుతోంది. గుమ్మయ్యగారిపల్లిలో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడిన లోకేశ్.. వైసీపీ రెండు వర్గాలుగా విడిపోయిందని ఆరోపించారు. ఒకటి రాజారెడ్డి వర్గం.. రెండు అంబేద్కర్ వర్గం అని తెలిపారు. రాజారెడ్డి వర్గానికి జగన్(Jagan) అధ్యక్షుడైతే.. అంబేద్కర్ వర్గానికి ఉండవల్లి శ్రీదేవి(Undavalli Sridevi) అధ్యక్షురాలని తెలిపారు. జగన్ పరిపాలన చెత్త పరిపాలన అని సాక్షాత్తూ వైసిపి ఎమ్మెల్యేలే అంటున్నారని వెల్లడించారు.
సాగనిస్తే పాదయాత్ర.. అడ్డుకుంటే దండయాత్ర అని సీఎం జగన్ కు మర్యాదగా చెప్పానని.. అయినా ఆయన వినలేదన్నారు. అడుగుడుగునా యాత్రకు అడ్డంకులు సృష్టించారని.. ఇప్పుడేమో పాదయాత్ర దెబ్బకు తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయని ఎద్దేవాచేశారు. ఇక దండయాత్ర ప్రారంభమైందని.. వైసీపీ పతనం ఖాయమని వ్యాఖ్యానించారు. భూస్వాముల నుంచి భూముల్ని విడిపించి పేదలకు పంచిన పరిటాల శ్రీరాములయ్య పుట్టిన గడ్డ పెనుకొండ అని వివరించారు. ఫ్యాక్షన్ రూపంలో సమాజాన్ని పట్టి పీడిస్తున్న అరాచక శక్తులను అణిచివేసిన పరిటాల రవీంద్రను ఎమ్మెల్యేను చేసి అసెంబ్లీకి పంపిన ప్రాంతం ఇది అని లోకేశ్(Lokesh) పేర్కొన్నారు.