స్వతంత్ర, వెబ్ డెస్క్: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కడపలో కొనసాగుతుంది. ఇందులో భాగంగా రాయలసీమ ప్రముఖులతో లోకేశ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘మిషన్ రాయలసీమ’ పేరుతో రాయలసీమకు టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరించారు. పాదయాత్రలో ‘సీమ కష్టాలు చూశా.. సీమ కన్నీళ్లు తుడుస్తా’అని లోకేశ్ తెలిపారు. రాయలసీమకు పరిశ్రమలు తీసుకొచ్చిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. సీమలో వైసీపీకి ఇచ్చినన్ని సీట్లు తమకు అభివద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు.
సీమ జిల్లాలను ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తామన్నారు.పెద్ద ఎత్తున ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్ తయారు చేసే కంపెనీలను పెద్ద ఎత్తున రాష్ట్రానికి తీసుకొస్తామని చెప్పారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామని.. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. మామిడి, బొప్పాయి, దానిమ్మ, చీని, అరటి తదితర పంటలు వేసేందుకు ప్రోత్సహిస్తామని చెప్పారు. 90శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్, వివిధ ఉద్యాన పంటలకు రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
సీడ్ హబ్‌గా ఏపీని మార్చి నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్నారు. పాత బీమా పథకాన్ని అమలు చేస్తామని.. రైతు బజార్ల సంఖ్య పెంచుతామని పేర్కొన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన వివరించారు. కౌలు రైతులను గుర్తించి సాయం అందిస్తామని వెల్లడించారు. ఇక వాటర్ గ్రిడ్ ద్వారా సీమలోని ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందిస్తామని లోకేశ్ ప్రకటించారు.
అలాగే స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా రాయలసీమను తీర్చిదిద్దుతామన్నారు. అంతర్జాతీయ పోటీలకు క్రీడాకారులను పంపడమే లక్ష్యంగా రాయలసీమలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని రకాల క్రీడలకు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీలు, స్టేడియాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా హామీలు ఇచ్చారు. వీటితో పాటు మరికొన్ని హామీలతో సీమవాసులకు లోకేశ్ భరోసా ఇచ్చారు.