హైడ్రా దూకడుతో హీరో నాగార్జునకు షాక్ తగిలింది. తుమ్మిడి కుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసింది హైడ్రా. దీంతో ఎన్నో ఏళ్ల నుంచి ఫంక్షన్లకు వేదికైన కన్వెన్షన్ గంటల వ్యవధిలోనే నేలకూలింది. తెలుగు రాష్ట్రాల్లో పేరు పరిచయం లేని వ్యక్తి అక్కినేని నాగార్జున. టాలీవుడ్‌లో ఎన్నో హిట్ కొట్టే చిత్రాలు చేయడంతోపాటు.. బిగ్ బాస్‌షోతో ప్రతీ ఇంట్లో నేను మీ నాగార్జున అంటూ అందరికీ మరింత దగ్గరైన వ్యక్తి. అలాంటి తెలుగు ప్రజల అభిమాన నటుడు యువ సామ్రాట్ అక్కినేని నాగార్జునకి బిగ్ షాక్ తగిలింది. 2010 నుంచి ఎన్నో సినిమా ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి వేదికగా నిలిచిన హై ప్రొఫైల్ ఎన్ కన్వెన్షన్‌ని హైదరాబాద్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ కూల్చివేసింది. గంటల వ్యవధిలోనే నేలమట్టం చేసింది. ఈ ప్రక్రియలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చి వేసింది హైడ్రా.
శేరిలింగంపల్లి మాదాపూర్ పరిధిలోని హైటెక్ సిటీకి దగ్గరలో ఎన్ కన్వెన్షన్ ఉంది. అయితే,..తమ్మిడి కుంట చెరువులోని దాదాపు 3.30 నుంచి 3.40 ఎకరాల్లో ఫుల్ ట్యాంక్ లెవల్‌ను ఆక్రమించి కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని ఎన్నో ఏళ్ళ నుంచి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్ సరస్సులోని FTL బఫర్ జోన్‌లో నిర్మించబడిందనేది ప్రధాన ఆరోపణ. గత కొన్నేళ్లుగా వివాదం కూడా నెలకొంది. దీంతో భాస్కర్‌రెడ్డి అనే వ్యక్తి కన్వెన్షన్ పై చర్యలు తీసుకుని సరస్సును పునరుద్ధరించాలని హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే,.. ఇది నాగార్జునకు చెందినది కావడంతో హైడ్రా అందుకు సాహసం చేస్తుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అందరి అంచనాలను తలకిందలు చేస్తూ కన్వెన్షన్‌ను కూల్చివేసింది హైడ్రా. ఇకపోతే కూల్చివేతలకు ముందుగా నోటీసులు ఇస్తే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే అవకాశం ఉందని భావించారు హైడ్రా అధికారులు. అందువల్లే కూల్చివేతలకు సంబంధించి ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కన్వెన్షన్‌ను కూల్చివేశారు.
మరోపక్క నాగార్జున కన్వెన్షన్ పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి లేఖ రాయడం చర్చకు దారి తీసింది. ఈ నెల 21 కోమటిరెడ్డి సీఎంకు రాశారు. తుమ్మిడి కుంట చెరువులో ఎఫ్టీఎల్ ప్రాంతంలో కన్వెన్షన్ నిర్మించినట్లు తెలిపిన మంత్రి.. శాటిలైట్ ఫోటోలతో సహా ఆధారాలను హైడ్రాకు అందించారు. మంత్రి లేఖ పై విచారణ జరిపి రంగంలో దిగిన హైడ్రా ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసింది. దీంతో కూల్చివేతకు మంత్రి కోమటిరెడ్డే కారణమా అన్న టాక్ మొదలైంది. కోమటిరెడ్డికి నాగార్జునకు మధ్య పడరాని వ్యవహారం ఏదైనా ఉందా..? లేదంటే కేవలం మంత్రిగా బాధ్యతల నిర్వహణలో భాగంగానే ఈ లేఖ రాసి ఉంటాడా అన్న చర్చ నడుస్తోంది. కన్వెన్షన్ కూల్చివేతపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి అన్న ఆయన.. వ్యవస్థలు తమ పని తాము చేస్తాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల తప్పిదాలను భవిష్యత్ తరాలకు ఇవ్వకుండా సరి చేస్తున్నామన్నారు మంత్రి జూపల్లి.
ఎన్ కన్వెన్షన్‌ను కూల్చి చిన్నా, పెద్దా అనే తేడాలేదనేది నిరూపించింది హైడ్రా. ఎంతటి వారైనా వదిలేదే లేదంటూ కూల్చివేతలకు దిగుతున్న హైడ్రా.. కబ్జాలే టార్గెట్‌గా సర్కార్ ఇచ్చిన బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలో అడ్డంకులను లెక్క చేయడం లేదు. ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా డోంట్ కేర్ అంటోంది. అందుకే హైడ్రా ఆపరేషన్ సక్సెస్ అవుతోంది. మరి తర్వాత కూలేది కేటీఆర్ ఫామ్‌హౌజేనన్న ప్రచారం జోరుగా సాగుతున్న వేళ.. ఆ కూల్చివేత ఖాయమేనా..? లేదంటే పరిణామాలు వేరేలా ఉంటాయా అన్నది ప్రస్తుతం కన్వెన్షన్‌పై చర్యలతో హైడ్రా వ్యవహారం ఆసక్తికర అంశంగా మారింది.