- గాంధీభవన్‌కు వచ్చిన భువనగిరి ఎంపీ వెంకట్‌రెడ్డి
- 26నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని వెల్లడి
కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చాలా రోజుల తరువాత గాంధీభవన్‌కు వచ్చారు. కొంతకాలంగా ఉప్పు నిప్పులా వున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్ మెట్లు ఎక్కనని తాను అనలేదన్నారు. కొత్త ఇన్‌ఛార్జ్ ఆహ్వానించడంతో వచ్చానని ఆయన తెలిపారు. గాంధీభవన్‌తో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. 26 నుంచి జరిగే పార్టీ కార్యక్రమాల్లో తాను పాల్గొంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
ఎఐసీసీ ఇచ్చిన షోకాజ్ నోటీసులు చెత్తబుట్టలో పడ్డాయని కొద్దిరోజుల క్రితం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. షోకాజ్ నోటీస్ అనేది లేనే లేదన్నారు ఆయన. టీపీసీసీ కమిటీలను తాను పట్టించుకోనన్నారు. నాలుగైదు సార్లు ఓటమి పాలైనవారితో తాను కూర్చోవాలా.. అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గతంలో ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్నందున ప్రజల్లోకి వెళ్లి యుద్ధం చేయాలన్నారు. ఈ విషయమై ఠాక్రే కొన్ని సలహాలు చెప్పారని పేర్కొన్నారు. తాను కూడా కొన్ని అంశాలను మాణిక్ రావుకు చెప్పినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వివరించారు. తన గురించి ఠాక్రేకు తెలుసునన్నారు.
గాంధీభవన్ మెట్లెక్కనన్న కోమటిరెడ్డి.. అకస్మాత్తుగా గాంధీభవన్‌లో ప్రత్యక్షమవ్వడం… రేవంత్‌తో భేటీ అవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.