తెలంగాణలో మూసీ సుందరీకరణపై ఢీ అంటే ఢీ అంటున్నాయి అధికార విపక్షాలు. ఇదే అంశంపై ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వగా.. ఇప్పుడు విపక్ష బీఆర్ఎస్ సైతం అందుకు సిద్ధమవుతోంది. మాటల తూటాలు పేలుస్తోంది. పదేళ్లు తెలంగాణను దోచుకున్న వాళ్లే.. ఇప్పుడు మూసీ పునరుజ్జీవాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే మూసీ నరకకూపంగా మారిందన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది మూసీ సుందరీకరణ కాదని.. పునరుజ్జీవమని స్పష్టం చేశారు. అంతేకాదు.. డీపీఆర్ రూపొందించడానికి ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలకు సంబంధించి ప్రజెంటేషన్ చూపించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇక, బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైడ్రా పేరు చెప్పి ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మూసీ పరివాహకంలో ఇప్పటివరకు ఒక్క ఇటుక పెళ్లను కూడా ప్రభుత్వం కూల్చలేదని.. హైడ్రా అసలు అటువైపు కన్నెత్తి చూడలేదన్నారు.పేదలపై నిజంగా విపక్ష నాయకులకు అభిమానం ఉంటే.. హరీష్, కేటీఆర్, ఈటల మూసీ ఒడ్డున మూడు నెలలు ఉండాలని సవాల్ విసిరారు. నిజంగా మూడు నెలలు వాళ్లంతా అక్కడే నివసిస్తే ప్రాజెక్టును విరమించుకుంటానని ఛాలెంజ్ విసిరారు రేవంత్ రెడ్డి.
మూసీ ప్రక్షాళన విషయంలో సీఎం రేవంత్ తీరు అర్థరహితమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే అంశంపై ఇవాళ సాయంత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మూసీ ప్రక్షాళనకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల్ని వివరించనున్నారు కేటీఆర్. తెలంగాణలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిందని ఎద్దేవా చేశారు కేటీఆర్. పాలన చేతకాక పనికి మాలిన మాటలు.. పాగల్ పనులు అంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కేటీఆర్.


