రాజకీయ సంక్షోభంలో ఉన్న బంగ్లాదేశ్‌లో పరిస్థితులు చక్కదిద్దేందుకు ఇవాళ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం రాత్రి 8 గంటలకు కొలువు దీరనుంది. పారీస్‌లో ఉన్న యూనర్ స్వదేశానికి చేరుకుంటున్నారు. ఆయన చేరుకున్న తర్వాత 15 మందితో సలహా మండలి ఏర్పాటు చేయనున్నారు. వీళ్లకు సైన్యం కూడా సహకరించేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
బంగ్లాదేశ్ ప్రజలకు యూనస్ ఓ సందేశాన్ని పంపించారు. ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని సూచించారు. దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు ఇదో గోప్ప అవకాశమని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితిల్లో హింసను ప్రేరేపిస్తే బాగోదని హితవు పలికారు. సామాన్య ప్రజలకు విద్యార్థులు, పార్టీలు అన్నీ శాంతియుతంగా ఉండి దేశాభివృద్ధిలో భాగమవ్వాలని కోరారు.
మరోవైపు బంగ్లాదేశ్‌లో హింస మాత్రం ఆగడం లేదు. సైనిక పాలన సాగుతున్న వేళ లూటీలు జరుగుతున్నాయి. అవామీ లీగ్ నాయకులను టార్గెట్ చేసుకుంటున్నారు ఆందోళనకారులు. వారిని వెతికిపట్టుకొని దాడులు చేస్తున్నారు. చిత్రవధ చేసి చంపేస్తున్నారు. ఇలా డజన్ల మందిని హత్య చేసినట్టు మీడియా చెబుతోంది. కొన్ని రోజులుగా హింసకు బలైన వారి సంఖ్య దాదాపు ఐదు వందలకు చేరుకుంది. భారతీయులతోపాటు ఇతర దేశీయులను టార్గెట్ చేసుకుంటున్నారు అల్లరి మూకలు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మహమ్మద్ యూనస్‌కు కఠిన సవాళ్లు ఎదురుకానున్నాయి. పేదల బ్యాంకర్‌గా పేరున్న ఆయన ఏం చేస్తారని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. లక్షల మందిని పేదరికం నుంచి తప్పించిన యూనస్ ఇప్పుడు దేశాన్ని ఎలా గట్టెక్కిస్తారనే ప్రశ్న తలెత్తుతోంది.