ఏపీ అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు ముగిసింది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. రానురాను ఎమ్మెల్యేలకు సబ్జెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గుతోందన్నారు. ఇది మంచిది కాదని… నిరంతరం నేర్చుకోవాలని సూచించారు. ఎవరు ఏ సబ్జెక్టు మాట్లాడుతున్నారో తాను కూడా నోట్ చేసుకుంటున్నానని సీఎం అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో కూడా ఏ విధమైన నిధుల కేటాయింపులు ఉన్నాయో స్టడీ చేసుకుంటే ఎమ్మెల్యేలకు ఉపయోగపడుతుందన్నారు. సభలో ప్రతిపక్షం లేదు కదా మనకేముంది అని అనుకోవద్దని సీఎం సూచించారు. మనం ప్రజలకు జవాబుదారీగా పనిచేద్దామని కోరారు. ప్రజలకు ఏం చేశామో చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక అని అన్నారు. టీడీపీ నుంచి 61 మంది, జనసేన నుంచి 15 మంది, బీజేపీ నుంచి నలుగురు, వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు కొత్తగా ఎన్నికయ్యారని తెలిపారు.