తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి తెలంగాణకు రానున్న మోదీ పర్యటనపై రాజకీయంగా, పరిపాలనాపరంగా ఆసక్తి నెలకొంది.
ఈ నెల 10న హైదరాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోనే కార్యక్రమాలు జరగాల్సి ఉండగా… తాజా మార్పులతో హైటెక్ సిటీ కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సమాచారం.
ఈ నెల 10న మధ్యాహ్నం బెంగళూరు నుంచి బయలుదేరే మోదీ…సుమారు మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హైటెక్ సిటీకి వెళ్లి… మధ్యాహ్నం 3.45 నుంచి 4.15 గంటల మధ్య సాయి సింధు హాస్పిటల్ ప్రారంభోత్సవం చేయనున్నారు. తరువాత సాయంత్రం 4.40 గంటలకు తిరిగి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు ప్రధాని. అక్కడ సుమారు 45 నిమిషాలపాటు రిజర్వ్ టైమ్‌లో రాష్ట్ర బీజేపీ నాయకులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది. అనంతరం… సాయంత్రం 5.30 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుని… సాయంత్రం 6.30 వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
ఇక రాత్రి 6.45 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి జామనగర్‌కు బయలుదేరనున్నారు ప్రధాని మోడీ. మొత్తానికి… మోదీ తెలంగాణ పర్యటనతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.


