ఆకాశానికి చిల్లు పడ్డట్టుగా భారీ వర్షం ఏకధాటిగా కురుస్తోంది. దీంతో మహబూబాబాద్ జిల్లా చిగురాకులా వణికిపోతోంది. ఎడతెరిపి లేని వర్షంతో సీతారాంతండాకు వరద నీరు పోటెత్తింది. వరదలో జీపు చిక్కుకుపోవడంతో.. అందులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన 9 మందిని సహాయక బృందాలు రక్షించాయి. ఆ తర్వాత వరదలో ఖాళీ అయిన జీపు వరదలో కొట్టుకుపోయింది.
భారీ వర్షాల కారణంగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం మొండలతోగు, జనగాలంచ వాగు ఉధృతికి కొట్టుకుపోయిన రోడ్డును, మేడారం జంపన్న వాగు ఉధృతిని మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని..స్వీయ రక్షణ పాటించాలని పిలుపునిచ్చారు. ముంపు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని.. వాగులను దాటే ప్రయత్నం చేయొద్దని, ఆఫీసర్లకు సహకరించాలని సూచించారు.