స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఏపీ రాజకీయాలపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్మిక దినోత్సవ సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రాలో కుల రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినట్లు పోలవరం ప్రాజెక్ట్ కూడా కట్టే సత్తా కేసీఆర్ కు మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు కూడా సాధించుకుంటామని తెలిపారు. ఏపీలో కూడా కేసీఆర్ సీఎం కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.
మంత్రి కేటీఆర్ వల్లే హైదరాబాద్ కళకళలాడుతోందని ఆయన కొనియాడారు. మహారాష్ట్రలోనూ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా గతంలోనూ మల్లారెడ్డి ఏపీ రాజకీయాలపై కామెంట్స్ చేశారు. ఏపీలో బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కాలినడకన తిరుమలకు వచ్చి పూజలు చేస్తానన్నారు. 2024లో ఏపీలోని 175 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ బరిలో ఉంటుందని వ్యాఖ్యానించారు.