స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు.. ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై తాజాగా స్పందించారు. ఏపీలో జరుగుతున్న దానికి తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మీడియా మిత్రులు చంద్రబాబు అరెస్ట్, ప్రస్తుతం ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై కేటీఆర్‌కు ప్రశ్నలు సంధించారు. వాటికి కేటీఆర్ సమాధానం ఇస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్న వాటి గురించి మాట్లాడటానికి ఏమీ లేదని అన్నారు.
ఏపీలో జరుగుతున్న దానికి తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. కాగా, చంద్రబాబు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబుకు జైలులో భద్రత లేదంటూ, ఆయన్ని హౌస్ కస్టడీకి ఇవ్వాలని లూథ్రా ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై సుధీర్ఘ విచారణ జరిపిన కోర్టు.. సీఐడీ వాదనలతో ఏకీభవించింది. చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌ను కొట్టి వేసింది.
దీంతో ఆయన మళ్లీ జైలులోనే ఉండాల్సి వస్తోంది. చంద్రబాబు భద్రత విషయంలో జైలు అధికారులు కట్టుదిట్టుమైన ఏర్పాట్లు చేశారు. జైలులో ఆయనకంటూ ఓ ప్రత్యేక గదిని కేటాయించారు. ఇంటినుంచి భోజనం తెప్పించుకోవటానికి అనుమతి ఇస్తున్నారు. ఇక, ఈ మధ్యాహ్నం నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణిలు చంద్రబాబును జైలులో కలిశారు. కొద్దిసేపు ఆయనతో మాట్లాడారు. అనంతరం అక్కడినుంచి ఇంటి బాటపట్టారు.