స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. మంత్రులు ఇద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీతో కలిసి రూ.2వేల కోట్లతో దేవాపూర్‌లోని ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణకు భూమిపూజ చేశారు. అనంతరం బెల్లంపల్లిలో రూ.30 కోట్లతో చేపట్టిన రోడ్ల నిర్మాణానికి.. ఆలాగే రూ.44 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 350 ఎకరాలలో ఆహార శుద్ది పరిశ్రమలకు… 25 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు శిలాఫలకం వేశారు. బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజీలో ఎస్సీ, ఎస్టీ వసతి గృహాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ… త్వరలో బెల్లంపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభిస్తామని అన్నారు. బెల్లంపల్లి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నైపుణ్య కేంద్రం ఉపయోగపడుతుందన్నారు.