స్వతంత్ర, వెబ్ డెస్క్: ఐటీ రంగంలో బెంగళూరుతో పోటీపడేలా హైదరాబాద్‌ను నిలబెట్టామని మంత్రి కేటీఆర్ అన్నారు. నూతన పెట్టుబడులతో హైదరాబాద్ దూసుకుపోతుందని అన్నారు. హైటెక్ సిటీలోని టీ-హబ్‌లో ఐటీశాఖ తొమ్మిదవ వార్షిక నివేదికను మంత్రి విడుదల చేశారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 2013-14లో హైదరాబాద్‌లో ఐటీ ఉత్పత్తులు రూ.56 వేల కోట్లుగా ఉండేదని.. ప్రస్తుతం రూ.1.8 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు సాధించామని అన్నారు. తాను మొదటి సారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఐఎస్బీకి వెళ్లి.. ఎలా అయితే ఐటీలో బెంగుళూరుకు పోటీ ఇవ్వగలుగుతాం అనే చర్చ జరిగిందని తెలిపారు. ఐటీ రంగంలో ఒక ఉద్యోగం డైరెక్ట్ గా ఉంటే పరోక్షంగా 4 ఉద్యోగాలు ఉంటాయని అన్నారు. ఐటీ రంగంలో కేంద్రం నుంచి అందాల్సిన సాయం అందలేదని.. కేంద్ర ప్రభుత్వం సహకారం ఏం లేకుండా ఎక్కడో ఇక్కడో మాట సాయం తప్ప, ఒక్క పైసా సాయం కూడా రాష్ట్రానికి కేటాయించలేదని అన్నారు. ఇలా వార్షిక నివేదిక ఎవ్వరూ మాకు విడుదల చేయాలని చెప్పలేదని.. పారదర్శకంగా ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియజేయాలని విడుదల చేస్తున్నామని అన్నారు.
” తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో రాష్ట్రాన్ని ఐటి రంగంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నప్పుడు… అనేకమంది ఆశ్చర్యంగా చూశారు. అయినా ఈరోజు దేశ ఐటీ రంగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచేందుకు మా ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. గత పది సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం సహాయనిరాకరణ చేసినా, ఈ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించగలిగాం. హైదరాబాద్ ఐటి రంగానికి ఎంతగానో ఊతం ఇస్తుందనుకున్న ఐటిఐఆర్ ప్రాజెక్టుని కేంద్రం రద్దు చేసినా, ఈ ప్రగతి సాధ్యం అయ్యేలా చూడగలిగాం. దీంతోపాటు దాదాపు రెండు సంవత్సరాల పాటు కరోనా సంక్షోభం ఆ తర్వాత మారిన పరిస్థితులను కూడా దాటుకొని ఈ అభివృద్ధి సాధ్యమైంది. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ ఐటి రంగ వృద్ధిలో అన్ని సూచీల్లో… జాతీయ సగటును దాటుకొని వేగంగా ముందుకు పోతున్నది. హైదరాబాద్ నగరాన్ని ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చగలిగాం” –మంత్రి కేటీఆర్


