తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏపీలోని విశాఖకు మోదీ వచ్చిన రోజే ఈ ఘటన జరిగింది. తిరుమల వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో కొందరు భక్తులు మరణించడం చాలా దురదృష్టకరమని ప్రధాని మోదీ అన్నారు. వారి మరణానికి సంతాపం తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాన మంత్రి మోదీ ట్వీట్ చేశారు.
ఘటనతో తీవ్ర ఆవేదనకు లోనయినట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు తగిన సమాచారం ఇచ్చి… సహాయ సహకారాలు అందజేయాలని అధికారులను ఆదేశించానన్నారు. ఘటన నేపథ్యంలో తిరుపతిలోని టికెట్ కౌంటర్ల వద్ద అధికారులకు, పోలీసులకు జనసైనికులు సాయం అందించాలని పవన్ కల్యాణ్ సూచించారు.
వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల విడుదల నేపథ్యంలో తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడం తీవ్ర మనోవేదనకు గురిచేసిందని ఏపీ మంత్రి లోకేశ్ అన్నారు. ఇటువంటి అవాంచనీయ ఘటనలకు జరగకుండా టిటిడి మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మృతి చెందిన భక్తుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
తిరుమల వేంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కౌంటర్ల వద్ద తొక్కిసలాట ఘటనలో పలువురు భక్తులు మరణించిన వార్త తీవ్రంగా కలచివేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వారి మృతికి సంతాపం తెలియజేసి… మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
తొక్కిసలాట చాలా బాధాకరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఎక్స్ వేదికగా తెలిపారు. బాధితులకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఘటనపై తెలంగాణ మాజీ మంత్రి KTR ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ అధికారులుకు విజ్ఞప్తి చేశారు. దైవదర్శనానికి వచ్చిన భక్తులు తమ ప్రాణాలను కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు కేటీఆర్.
తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించడం బాధాకరం, దురదృష్టకరమన్నారు తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు. మరణించిన భక్తుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు జాగ్రత్తలు పాటించాలన్నారు.