26.2 C
Hyderabad
Thursday, January 16, 2025
spot_img

శ్రీవారి పాదాల వద్ద తెల్లారిన బతుకులు

వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారిని కనులారా దర్శించి తరించాలనుకున్నారు. కానీ టోకెన్లు తీసుకునేలోపే వారి బతుకులు తెల్లారిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఊహించని రీతిన చోటుచేసుకున్న తొక్కిసలాట జరిగింది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ తొక్కిసలాట ఘటనతో రుయా, స్విమ్స్ ఆసుపత్రిలో మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. టీటీడీ బైరాగిపట్టెడలో ఎంజీఎం స్కూల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం ఆరుగురి పాలిట మృత్యు ప్రాంగణమైంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందగా… 48 మంది అస్వస్థతకు గురయ్యారు. చనిపోయిన ఆరుగురిలో.. ఐదుగురు మహిళలు ఉన్నారు. రుయాలో నలుగురు, స్విమ్స్‌లో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. గాయపడ్డవారిని వైద్య సేవలు కొనసాగుతున్నాయి. రుయా, స్విమ్స్‌ ఆస్పత్రుల్లో 48 మందికి గాయాలైనట్లు పేర్కొన్నారు. రుయాలో 34, స్విమ్స్‌లో 14 మందికి చికిత్స అందుతోంది.

మృతులు విశాఖకు చెందిన స్వాతి, శాంతి, తమిళనాడుకు చెందిన నిర్మల, మల్లిగ, నరసరావు పేటకు చెందిన బాబు నాయుడు, రజినీగా గుర్తించారు. మృతులకు రుయాలో పోస్టుమార్టం జరగనుంది. పోస్టుమార్టం తర్వాత బంధువులకు డెడ్‌బాడీలను అప్పగించనున్నారు.

కాగా..సంక్రాంతి వేళ వచ్చే వైకుంఠ ద్వార దర్శనాల కోసం దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం టీటీడీ పెద్ద ఏర్పాట్లు చేసింది. అయినా టోకెన్ల జారీ కేంద్రాల్లోకి భక్తులను అనుమతించే సమయంలో పోలీసులు, టీటీడీ అధికారుల మధ్య సమన్వయం లోపించింది. బైరాగిపట్టెడలో గంటల కొద్ది వేచి చూసిన భక్తులు గేట్లు తెరవగానే పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో బైరాగిపట్టెడలో టీటీడీ ఎంజీఎం స్కూల్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం ఆరుగురి పాలిట మృత్యు ప్రాంగణమైంది. ఆరుగురు మృతి చెందగా.. 48 మంది అస్వస్థతకు గురయ్యారు.

తిరుపతిలో టికెట్ కౌంటర్ల వద్ద ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి బందోబస్తు లేకుండా భక్తులను ఒకేసారి క్యూలైన్లలోకి వదలడంతో తొక్కిసలాట చోటుచేసుకుందని భక్తులు ఆరోపిస్తున్నారు. పాలన వ్యవస్థ నిర్వహణ లోపంతో పాటు పోలీసులే దీనికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇవాళ ఉదయం 5 గంటలకు టోకెన్లు ఇస్తామని ప్రకటించిన టీటీడీ తన నిర్ణయాన్ని మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఊహించని స్థాయిలో భక్తులు తరలిరావడం… ఒక్కసారిగా అందరినీ లోపలికి పంపించడంతోనే ఈ తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

బైరాగిపట్టెడలోని రామానాయుడు పాఠశాల వద్ద తాకిడి తక్కువగా ఉంటుందని భావించిన యాత్రికులు బుధవారం ఉదయం పదింటికే అక్కడకు చేరుకున్నారు. రాత్రికి పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిక్కిరిశాయి. పోలీసులు పక్కనే ఉన్న శ్రీ పద్మావతి పార్కులోకి భక్తులను వదిలి… రాత్రి 8 గంటల 20 నిమిషాలకు అక్కడి నుంచి క్యూలైన్లలోకి అనుమతించారు. ప్రధాన గేటు వద్ద ముందుగా వెళ్తున్న భక్తుల మధ్య తోపులాటలో పలువురు కిందపడటంతో ఘోరం జరిగింది. కొంతసేపు భక్తులను క్యూలైన్లలోకి అనుమతించకుండా నిలిపివేశారు. గాయపడిన భక్తులను పోలీసులే అంబులెన్స్‌లో చేర్చి హుటాహుటిన స్విమ్స్, రుయాకు తరలించారు.

తిరుపతిలోని పలు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులను అనుమతించారు. అయితే బైరాగిపట్టెడలో అందుకు భిన్నంగా వ్యవహరించారు. దీంతో తొక్కిసలాట జరిగిందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కౌంటర్‌ వద్ద బాధ్యతలు నిర్వహిస్తున్న డీఎస్పీ రమణకుమార్‌కు రహదారి పొడవునా బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. అయితే ఏమీ జరగదులే అన్న ధీమాతో బారికేడ్లు ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది. భక్తులను పార్కులో ఉంచి ఒకేసారి అనుమతించడంతో ప్రాణనష్టం జరిగిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా టోకెన్లు జారీ చేసే కేంద్రాలను టీటీడీ, పోలీసులు పరిశీలించి ఏర్పాట్లపై చర్చించారు. చివరకు అమలు చేయడంలో ఘోరంగా విఫలమై ఆరుగురు ప్రాణాలు పోయేందుకు కారకులయ్యారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Latest Articles

ఫార్ములా-ఈ కారు రేసు కేసు – విచారణ ఎదుర్కొన్న కారు పార్టీ చిన్న సారు..!

రాజకీయాల్లో ఎన్నో పక్షాలు ఉన్నా.. పాలకపక్షం, ప్రతిపక్షం నడుమ వైరం నిత్యకృత్యం అయ్యింది. సహజంగానే జరుగుతుందో, అసహజంగానే జరుగుతుందో కాని... రాజకీయ పార్టీ అధికార పార్టీగా మారిందంటే చాలు...ప్రతిపక్ష పార్టీ నేతల తప్పుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్